హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): పది రోజులుగా మొగులుకు చిల్లు పడినట్టు కురిసిన వర్షాలు బుధవారం కొంత తెరిపినిచ్చాయి. మూడు రోజులపాటు రాష్ట్రంలో పొడివాతావరణం ఉం టుందని, ఒకటి రెండు చోట్ల మాత్రమే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బుధవా రం బలహీనపడి తెలంగాణకు దూరంగా వెళ్లిపోయిందని పేర్కొన్నది. ఈ నెల 11న ఉత్తర మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని వెల్లడించింది. ఈ నెల 12న తిరిగి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. దీని ప్రభావంతో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మం చిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ము లుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొంటూ ఎల్లో హెచ్చరిక జారీచేసింది.