Rain Alert | రాబోయే రెండుగంటల్లో హైదరాబాద్, రంగారెడ్డి సహా 15 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. జిల్లాల్లో రెండుగంటల్లో వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని.. 15 జిల్లాల్లో రెండు నుంచి మూడుగంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబ్‌నగర్, మేడ్చల్, నల్గొండ, నారాయణపేట, వికారాబాద్, వనపర్తి, సూర్యాపేట, హన్మకొండ, నాగర్ కర్నూల్ వర్షాలుంటాయని హెచ్చరించింది.
ఇప్పటికే వాతావరణశాఖ రాగల రెండురోజులు పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. పలు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మేడ్చల్, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న పేర్కొన్నారు. హైదరాబాద్, హనుమకొండ, ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. గురువారం సైతం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
మరో వైపు పశ్చిమ, మధ్య, దక్షిణ, తూర్పు హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైడ్రా అంచనా వేసింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో వర్షం పడుతుందని.. సాయంత్రం, రాత్రి వేళల్లో మరింత భారీగా వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. వాహనాల్లో రాకపోకలు తగ్గించానలి.. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారంతా అప్రతమత్తంగా ఉండాలని.. సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు. హైడ్రా, జీహెచ్ఎంసీ బృందాలు అప్రమత్తంగా ఉన్నాయని తెలిపింది. అత్యవసర సమయాల్లో డీఆర్ఎఫ్ హెల్ప్‌లైన్ 040 29560521తో పాటు 9000113667 , 9154170992 నంబర్లలో సంప్రదించాలని కోరింది.