ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 10: సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా వేలాదిమంది పోలీసులు లాఠీలతో మోహరించడంతో క్యాంపస్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. మరోవైపు విద్యార్థుల నిరసన గొంతు నొక్కేందుకు అధికారులు వందలాది మంది మఫ్టీ పోలీసులను రంగంలోకి దింపారు. క్యాంపస్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సీఎం సభ మూడు సార్లు వాయిదా పడింది. తొలుత ఉదయం 9 గంటలకు సభ ఉంటుందని అని చెప్పిన అధికారులు, ఆ తర్వాత 11 గంటలకు వాయిదా పడ్డట్టు తెలిపారు. చివరికి మధ్యాహ్నం ఒంటిగంటకు మార్చారు. సీఎం రేవంత్‌రెడ్డి క్యాంపస్‌లోకి వస్తుండగా విద్యార్థులు ‘సీఎం డౌన్‌డౌన్’ అంటూ నినాదాలు చేశారు.
క్యాంపస్‌కు వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, ఆ పార్టీ నాయకుడు చలగాని దయాకర్‌ను విద్యార్థులు అడ్డగించారు. ఉద్యోగాల నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారమంటూ నిలదీశారు. మరోవైపు… అధ్యాపకులు, ఉద్యోగులు, పూర్వ విద్యార్థులు, విద్యార్థుల గ్యాలరీలలో ఎటు చూసినా మఫ్టీ పోలీసులే కనిపించారు. సీఎంకు వినతిపత్రాలు ఇచ్చేందుకు కూడా ఓయూ అధికారులు ఎవరినీ అనుమతించలేదు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం రోజునే.. ఓయూ అధికారులు, పోలీసులు తమ ప్రాథమిక హక్కులను కాలరాశారని విద్యార్థులు మండిపడుతున్నారు. అధికారులు సీఎం సభకు ప్రైవేట్ కళాశాలల విద్యార్థులను తరలిం చారు.అధ్యాపకుల గ్యాలరీ ఖాళీగా కనిపించడంతో అక్కడా విద్యార్థులనే కూర్చోబెట్టారు.
రాజకీయ విమర్శలు చేయనంటూనే!
ఓయూ సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రాజకీయ విమర్శలు చేయనంటూనే, ప్రత్యర్థులపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాలేజీ విద్యార్థుల సభలో దూషణలు, రాజకీయ అంశాలు మాట్లాడటం చాలా దారుణమని పలువురు అధ్యాపకులే వ్యాఖ్యానించడం కనిపించింది. మానవహక్కుల దినోత్సవాన్ని మానవత్వ దినంగా ఉచ్ఛరించడంతో పలువురు నవ్వుకున్నారు. రాష్ట్రంలో 25లక్షలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, అందులో 18 లక్షలకు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారని అనడంతో అంతా ముక్కున వేలేసుకున్నారు. సీఎం సభకు ఎంట్రీ పాస్‌లు అవసరంలేదని చెప్పిన ఓయూ అధికారులు ముందురోజు రాత్రి ఎనిమిది గంటల తర్వాత 28 మందికి మాత్రమే పాస్‌లు ఇస్తున్నట్టు ప్రకటించారు. పాస్‌లతో వచ్చిన మీడియా ప్రతినిధులకు కూడా చేదు అనుభవం ఎదురైంది. భద్రతా సిబ్బంది అనుమతించలేదు. మీడియా ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం తెలుపగా ఏసీపీ గ్యార జగన్ చొరవ తీసుకుని, మీడియా ప్రతినిధులను వెంట తీసుకువెళ్లి అధ్యాపకుల గ్యాలరీలో కూర్చోబెట్టారు.
నైపుణ్యాలు పెంచేందుకే స్కిల్స్ వర్సిటీ: సీఎం
రాష్ట్రంలో విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో యూనివర్సిటీలు ఉన్నప్పటికీ, విద్యార్థుల్లో అవసరమైన సాంకేతిక నైపుణ్యాలు కరువయ్యాయని చెప్పారు. అందుకే స్కిల్స్ యూనివర్సిటీకి రూపకల్పన చేశామని వివరించారు. ఓయూలో అభివృద్ధి పనుల కోసం రూ.వెయ్యి కోట్లు మంజూరు చేస్తామని, ఈ మేరకు జీవో ఇచ్చామని తెలిపారు. 2036 ఒలింపిక్స్‌లో బంగారు పతకాలు సాధించడమే ధ్యేయంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. టీహబ్ ద్వారా కొత్త స్టార్టప్‌లకు ఆర్థిక సాయం అందించేందుకు వెయ్యి కోట్లు కేటాయిస్తామని తెలిపారు. ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయాలని వర్సిటీ అధికారులు కోరగా, ఇప్పటికే ఉన్న కమిటీలో చర్చించుకుని చర్యలు తీసుకోవాలని ఓయూ అధికారులకు సూచించారు.
రేవంత్ భజనలో తరించిన అధికారులు
ఓయూ వేదికగా జరిగిన సభలో అధికారులు, అధ్యాపకులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భజనలో తరించారని విద్యార్థులు విమర్శిస్తున్నారు. ప్రతిష్ఠాత్మకమైన విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో, ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ పాటలు మోగించడమేంటని నిలదీస్తున్నారు. వర్సిటీ అధికారులు తమ భక్తిని చాటుకోవడమే పనిగా పెట్టుకున్నారని మండిపడుతున్నారు. రేవంత్ భజనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన అధికారులు సభకు హాజరైన వారికి కనీస వసతులు కల్పించలేదని విమర్శిస్తున్నారు. కనీసం తాగునీరు కూడా ఏర్పాటు చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్తున్నారు. ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ ముందస్తుగా సిద్ధం చేసుకున్న ప్రసంగాన్ని చూసి చదువుతూ పలుమార్లు తడబాటుకు గురవడంతో వేదికపై ఉన్నవారితోపాటు వేదిక ముందు ఉన్న అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులు నవ్వుల్లో మునిగిపోయారు.
ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం.. సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పేందుకు ప్రయాసపడుతూ ‘సీఎం రేవంత్‌రెడ్డి అప్పట్లో గీతమ్మతో ప్రేమలో పడ్డారు… ఇటీవల విద్య అనే అమ్మాయితో ప్రేమలో పడ్డారు’ అని అన్నారు. ప్రతిష్ఠాత్మకమైన ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ హోదాలో ఉన్న కాశీం… బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.. ప్రస్తుత ప్రభుత్వం నిధులు ఇస్తున్నదంటూ భజన చేయడమేంటని నిలదీస్తున్నారు. ప్రొఫెసర్ కాశీం హోదాను మరిచి, దిగజారి రాజకీయ ప్రసంగం చేశారని మండిపడుతున్నారు. ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తానంటూ చెప్పుకునే ప్రొఫెసర్ కాశీం.. ప్రజలకు ఇచ్చిన హామీలు విస్మరించి, ప్రజాకంటక పాలనతో వేధిస్తున్న సీఎంను ఆకాశానికి ఎత్తడం అంటే.. తన హోదా దిగజారి మాట్లాడటమే అవుతుందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
చెప్పిందేంది?
‘మళ్లీ నేను వస్తా, మా వీసీకి, పోలీస్ సిబ్బందికి చెప్తున్నా.. నేను వచ్చిన రోజు క్యాంపస్‌లో ఒక్క పోలీస్‌ను కూడా పెట్టకండి. విద్యార్థులు ఎవరైనా ఏ విధమైన నిరసననైనా తెలుపనీయండి. నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వారికిద్దాం. మళ్లీ వచ్చినప్పుడు ఠాగూర్ ఆడిటోరియంలో కాదు… ఆర్ట్స్ కళాశాల ముందు మీటింగ్ పెడుతా. మీకు కావాల్సిన వందల కోట్ల నిధులు ఇస్తా
– ఆగస్టు 25న ఓయూకు వెళ్లిన సందర్భంగా సీఎం రేవంత్ ఇచ్చిన మాట.
జరిగిందేంది?
బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా ఓయూ క్యాంపస్‌లో అడుగడుగునా నిర్బంధమే కనిపించింది. పోలీసుల ఆంక్షలు, ముందస్తు అరెస్టులు, అర్ధరాత్రి హాస్టళ్లలోకి చొరబడి విద్యార్థినేతలను స్టేషన్లకు తరలించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. సీఎం పర్యటన సందర్భంగా వర్సిటీ క్యాంపస్‌లో అడుగడుగునా పోలీసు బలగాలు మోహరించాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ కాలం నాటి రోజులను తలపించేలా పోలీసులు క్యాంపస్‌లో ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. విద్యార్థులను ఇనుప కంచెలతో అడ్డుకుంటూ.. ముందస్తు అరెస్టులతో అణచివేస్తూ విరుచుకుపడ్డారు. రెండు రోజుల ముందుగానే యూనివర్సిటీ క్యాంపస్‌ను పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి హాస్టళ్లలోకి చొరబడి మరీ విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకుని, వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.