అయిజ/శ్రీశైలం/నందికొండ/మహదేవపూర్/కన్నాయిగూడెం, జూలై 10 : కృష్ణా, తుంగభద్ర నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. శ్రీశైలం నిండుకుండలా మారింది. ఇక్కడ మూడు గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపు పరుగులు తీస్తున్నది. గురువారం జూరాల ప్రాజెక్టుకు 1.10 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, 12 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ద్వారా మొత్తం అవుట్ ఫ్లో 1,13,681 క్యూసెక్కులు నమోదైంది.
కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతుండటంతో 11 క్రస్ట్ గేట్లు 2.5 అడుగుల మేరకు ఎత్తి దిగువకు 31,130 క్యూసెక్కుల నీటిని తుంగభద్ర నదిలోకి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉన్నది. మూడు క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 81,195 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.
ఎగువ నుంచి శ్రీశైలానికి గురువారం సాయంత్రం వరకు 1,75,233 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.80 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 203.4290 టీఎంసీలకు చేరుకున్నది. కాగా నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకుగాను 540.60 అడుగులకు నీరు చేరింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని లక్ష్మీ (మేడిగడ్డ) బరాజ్‌కు వరద పోటెత్తుతున్నది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో బరాజ్‌కు ప్రవాహం పెరుగుతున్నది. గురువారం 6,36,130 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. మొత్తం 85 గేట్లు ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం వద్ద గోదావరి నది ప్రవాహం భారీగా పెరిగింది. పుష్కర ఘాట్లను తాకుతూ ప్రవహిస్తున్నది.
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం సమ్మక్క బరాజ్ వద్ద గోదావరిలో వరద ప్రవాహం భారీగా పెరుగుతుండటంతో గురువారం 59 గేట్లు ఎత్తారు. ఎగువనుంచి బరాజ్‌లోకి 5,80,430 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తున్నది. ఈ ఏడాదిలో గోదావరిలో వరద పెరగడంతో ఎగువనుంచి భారీ వృక్షాలు, కర్ర దుంగలు కొట్టుకొచ్చి గేట్లను బలంగా ఢీ కొంటున్నాయి. ఇలాంటి సమయంలో బరాజ్ గేట్లను ఎత్తకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది.