హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): చిన్నారులకు విజయవంతంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించి వారి జీవితాలకు భరోసా కల్పించారు నిమ్స్ వైద్యులు. యూకేకు చెందిన పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమణ బృందం సహకారంతో నిమ్స్ కార్డియోథొరాసిక్ విభాగాధిపతి డాక్టర్ అమరేశ్ ఆధ్వర్యంలో 19మంది చిన్నారులకు విజయవంతంగా గుండె శస్త్రచికిత్సలు జరిగాయి. గత నెల నుంచి ప్రారంభమైన ఈ శస్త్రచికిత్సల ప్రక్రియలో ముందుగా అత్యంత క్లిష్టమైన గుండె సమస్యలు ఎదుర్కొంటున్న చిన్నారులను గుర్తించిన వైద్య బృందాలు ఈ నెలలో శస్త్రచికిత్సలు చేయడం ప్రారంభించారు. ఈ సంవత్సరం యూకే, నిమ్స్ సంయుక్త ఆధ్వర్యంలో మొత్తం 19మంది చిన్నారులకు విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించి చిట్టి గుండెలకు తామున్నామన్న భరోసా కల్పించారు.
గతంలో పీడియాట్రిక్ కార్డియో సర్జరీ విభాగం ప్రభుత్వ దవాఖానల్లో అందుబాటులో లేకపోవడంతో పలు రకాల హృద్రోగాలతో బాధపడే ఎంతో మంది చిన్నారులు ప్రైవేట్ దవాఖానలపైనే ఆధారపడాల్సి వచ్చేది. దీన్ని దృష్టిలో పెట్టుకొని నాటి కేసీఆర్ సర్కార్ నిమ్స్‌లో 2022లో రూ.5కోట్ల వ్యయంతో పీడియాట్రిక్ కార్డియో సర్జరీ విభాగాన్ని ఏర్పాటు చేశారు. నాటి బీఆర్ఎస్ సర్కార్, నిమ్స్ వైద్య బృందం చొరవతో చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు చేయడానికి ఐదేండ్ల క్రితం యూకే వైద్య బృందం ముందుకు వచ్చింది. దీంతో ప్రతి సంవత్సరం 20మంది చిన్నారులకు క్లిష్టమైన గుండె శస్త్ర చికిత్సలను పూర్తి ఉచితంగానే నిర్వహిస్తున్నది.