అధిక బరువు తగ్గితే ఆరోగ్యపరమైన ప్రమాదాలన్నీ తగ్గిపోతాయని సాధారణంగా అనుకుంటాం. అయితే శరీరం గతంలో ఎదురొన్న అధిక బరువు ప్రభావాన్ని కొంతకాలం గుర్తుంచుకుంటుందన్న ఆసక్తికరమైన విషయాన్ని ఓ తాజా పరిశోధన వెల్లడించింది. ఈ అధ్యయనాన్ని బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హామ్ పరిశోధకులు నిర్వహించారు. ఇటీవల వెలువడిన ఈ పరిశోధన ప్రకారం, అధిక బరువుతో ఉన్న కాలంలో రోగనిరోధక వ్యవస్థలోని కొన్ని ముఖ్యమైన కణాల్లో ఏర్పడిన అణు స్థాయి మార్పులు, బరువు తగ్గిన తర్వాత కూడా ఐదు నుంచి పది సంవత్సరాల వరకూ కొనసాగవచ్చని పరిశోధకులు గుర్తించారు. దీనిని శాస్త్రవేత్తలు ఒక రకమైన ‘శరీర జ్ఞాపకం’గా అభివర్ణిస్తున్నారు.
అంటే బరువు తగ్గిన వెంటనే శరీరంలోని ప్రతి వ్యవస్థ గతస్థితిని పూర్తిగా మరచిపోతుందని చెప్పలేమన్నమాట. ముఖ్యంగా రోగనిరోధక కణాల్లో అధిక బరువు ముద్ర కొంతకాలం కొనసాగడం వల్ల, బరువు తగ్గిన తర్వాత కూడా కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు పూర్తిగా తగ్గడం లేదన్న విషయాన్ని ఇది చర్చిస్తున్నది. అధిక బరువుతో ఉండి బరువు తగ్గే ఇంజెక్షన్లు తీసుకున్న వారు, చిన్నప్పటి నుంచే ఊబకాయానికి దారి తీసే అరుదైన ఆల్ స్ట్రోమ్ సిండ్రోమ్ ఉన్నవారు, పది వారాల వ్యాయామ కార్యక్రమంలో పాల్గొన్న వారు, కాలికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న సాధారణ, అధిక బరువు ఉన్న వ్యక్తులను … పది సంవత్సరాల కాలం పాటు పరిశీలించి ఈ ఫలితాలను వెల్లడించారు. అయితే దీన్ని ‘బరువు తగ్గినా ప్రయోజనం లేదు’ అని అర్థం చేసుకోవడం మాత్రం పొరపాటు. బరువు తగ్గడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఈ పరిశోధన చెబుతున్నది ఒకటే… అధిక బరువు శరీరంపై చూపే ప్రభావం కేవలం కొవ్వు పరిమాణానికే పరిమితం కాకుండా, శరీరంలోని కొన్ని కణస్థాయి మార్పులతో కూడా ముడిపడి ఉండవచ్చని. ఈ అధ్యయనం భవిష్యత్తులో అధిక బరువుతో సంబంధం ఉన్న ఆరోగ్య సమస్యలను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే ఈ మార్పులు ఒక్కో వ్యక్తిలో ఎలా ఉంటాయి? వాటిని పూర్తిగా తగ్గించేందుకు ఏం చేయాలి? వంటి ప్రశ్నలకు ఇంకా విస్తృతమైన పరిశోధనలు అవసరం.