హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కవిత బెయిల్ వ్యవహారంలో ఈడీ తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ విషయంలో వచ్చే గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను 27కు వాయిదా వేసింది. కస్టడీలో ఉన్న కవిత.. బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆమె పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో జస్టిస్ జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసులోనే నిందితులుగా ఉన్న ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయాన్ని కవిత తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి గుర్తుచేశారు. ఇదే రీతిన కవితకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించారు. ఈ కేసులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసిందని, ఈడీ ఇంకా దాఖలు చేయాల్సి ఉందని ఈడీ తరఫు న్యాయవాదులు నివేదించారు. దీంతో ధర్మాసనం ఈడీ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. హైకోర్టులో కేసు డైరీలో ఉండగా కౌంటర్ దాఖలు చేసేందుకు ఆలస్యం ఎందుకైందని ప్రశ్నించింది. శుక్రవారం వరకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. బెయిల్‌కు కవిత అర్హురాలని ఆమె న్యాయవాదులు ధర్మాసనానికి నివేదించారు.
ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వస్తుందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. కవితకు బెయిల్ రాకుండా ఈడీ కాలయాపన చేస్తుందనే అనుమానాలు ఈడీ తీరుతో నిరూపితమైందనారు. బెయిల్ పిటిషన్‌పై విచారణ నేపథ్యంలో మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, వీ శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ రమణ, ఎమ్మెల్యే సంజయ్, నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఢిల్లీకి చేరుకున్నారు. తీహార్ జైలులో ఉన్న కవితతో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ రమణ మంగళవారం ములాఖత్ అయ్యారు. ఆమె యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.