హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): కృష్ణా బేసిన్‌లోని నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు ఎవరి పరిధిలో ఉండాలన్న అంశంపై సుప్రీంకోర్టులో విచారణ ఈ నెల 7కు వాయిదా పడింది. ఆ ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) పరిధిలోకి తెస్తూ 2021లో కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యుత్తు కేంద్రాలను కూడా కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వ గెజిట్‌ను రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్లు వేశాయి. ఈ రెండు పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టులో వేర్వేరు ధర్మసనాలు విచారణ జరిపాయి. తొలుత తెలంగాణ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం.. ఈ కేసులో సుదీర్ఘ వాదనలు వినాల్సి ఉన్నదని పేర్కొంటూ విచారణను గురువారానికి వాయిదా వేసింది. అనంతరం ఏపీ పిటిషన్‌పై జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈ రెండు పిటిషన్లు ఓవర్‌ల్యాప్ అవుతాయని అభిప్రాయపడిన ధర్మాసనం.. తెలంగాణ పిటిషన్‌పై విచారణ జరుపుతున్న ధర్మాసనానికి ఏపీ పిటిషన్‌ను బదిలీ చేయాలని, ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) దృష్టికి తీసుకెళ్లాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. దీంతో ఈ పిటిషన్లు గురువారం విచారణకు రానున్నాయి.