హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తేతెలంగాణ): కంచ గచ్చిబౌలి భూముల అంశంపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. ఈ నెల 3న జరిగిన విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి పలు ప్రశ్నలు సంధించిన న్యాయస్థానం వాటికి సమాధానాలిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. క్షేత్రస్థాయిలో పర్యటించి ఆ భూములపై నివేదిక ఇవ్వాలని కేంద్ర సాధికార కమిటీకి ఉత్తర్వులు జారీచేసింది.
ఈ ఆదేశాల మేరకు కేంద్ర సాధికార కమిటీ గతవారం హైదరాబాద్లో హెచ్సీయూ భూములను పరిశీలించి వెళ్లింది. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి కూడా రెండు రోజులు ముందుగానే అఫిడవిట్ దాఖలు చేశారు. కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానికి చెందినవని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈ అంశాలపై జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ జరుపనుంది.