హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): క్యాన్సర్ అవగాహన, ఆరోగ్య సంరక్షణ నిర్వహణ రంగంలో అందిస్తున్న సేవలకు స్వస్తవ క్యాన్సర్ కేర్ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ వాసుదేవ్ చతుర్వేదికి శనివారం హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకమైన ‘బెస్ట్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ప్రదానం చేసింది. డాక్టర్ చతుర్వేదికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఐదు దశాబ్దాలకు పైగా అనుభవమున్నది.
ఆయన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో కార్పొరేట్ అఫైర్స్, స్ట్రాటజిక్ అలయన్స్ వైస్ ప్రెసిడెంట్, కిమ్స్ హాస్పిటల్లో వైస్ ప్రెసిడెంట్‌తో సహా పలు కీలక పదవులు నిర్వహించారు. 2017లో స్వస్తవ క్యాన్సర్ కేర్ సంస్థను స్థాపించారు. యువత, మహిళల్లో ముందస్తు గుర్తింపు, క్యాన్సర్ నివారణపై దృష్టి సారించి ఆ దిశగా డాక్టర్ చతుర్వేది కృషి చేస్తున్నారు.