వేములవాడ, ఆగస్టు 19: స్టేషన్ బెయిల్ కోసం లంచం తీసుకొంటూ ఏసీబీకి దొరికిన హెడ్‌కానిస్టేబుల్ చంద్రప్రకాశ్ అక్రమా లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గురువారం అర్ధరాత్రి ఆయన ఇంట్లో సోదాలు చేయగా, అక్రమం గా నిల్వచేసిన 41 బుల్లెట్లు, 4.5 లక్షల నగదు పట్టుబడటం పోలీసు శాఖలో కలకలం రేపుతున్నది.
ఏసీబీ డీఎస్పీ భద్రయ్య.. హెడ్‌కానిస్టేబుల్ చంద్రప్రకాశ్ వ్యవహారంపై లోతుగా విచారణ చేపట్టారు. వేములవాడలో ఆయన అద్దెకు ఉంటున్న ఇంట్లో ఏసీబీ సోదాలు చేయగా 41 బుల్లెట్లు లభ్యమయ్యాయి. ఇందులో 9 ఎంఎం ఒకటి, 303 బుల్లెట్లు 40 గుర్తించి స్వాధీనం చేసుకొని పట్టణ పోలీసులకు అప్పగించారు. ఆయనపై అక్రమ ఆయుధాల నిల్వ కేసు నమోదు చేశారు. 41 బుల్లెట్లు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయం అంతుచిక్కకుండా ఉన్నది. దొరికిన రూ.4.5 లక్షలను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు.
కరీంనగర్జిల్లాలోని సైదాపూర్‌కు చెందిన చంద్రప్రకాశ్ 1985వ బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్. వేములవాడ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఐదేండ్లుగా పనిచేస్తున్నాడు. 37 ఏండ ్లసర్వీస్ ఉన్న చంద్రప్రకాశ్‌కు ఆది నుంచీ వివాదాస్పదుడిగా పేరున్నది. గతంలో రెండుసార్లు సర్వీస్ నుంచి తొలగించగా మూడుసార్లు సస్పెన్షన్ వేటుపడింది.