హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 పరీక్షకు దరఖాస్తు చేయకపోయినా ఓ అభ్యర్థికి హాల్‌టికెట్ జారీచేశారని జరుగుతున్న ప్రచారాన్ని టీఎస్పీఎస్సీ ఖండించింది. అదంతా తప్పుడు ప్రచారమని స్పష్టంచేసింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన అభ్యర్థి జక్కుల సుచిత్ర నిరుడు గ్రూప్-1 పరీక్షకు దరఖాస్తు చేశారని, అక్టోబర్‌లో నిర్వహించిన పరీక్షకు కూడా ఆమె హాజరయ్యారని తెలిపింది. గ్రూప్-3, గ్రూప్-4 దరఖాస్తు చేస్తే గ్రూప్-1 హాల్‌టికెట్ ఇచ్చారన్న ప్రచారం పూర్తిగా అబద్ధమని పేర్కొన్నది. ‘గ్రూప్-1 ఉద్యోగానికి దరఖాస్తు చేయకపోయినా తనకు హాల్‌టికెట్ వచ్చిందని జక్కుల సుచిత్ర ఆరోపించడం పూర్తిగా అవాస్తవం.
నిజామాబాద్‌కు చెందిన జక్కుల శ్రీధర్ కుమార్తె జక్కుల సుచిత్ర టీఎస్పీఎస్సీ ఐడీ: TS1201206420తో గ్రూప్-1 ఉద్యోగానికి దరఖాస్తు చేశారు. నిరుడు అక్టోబర్ 16న జరిగిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష రాశారు. నిజామాబాద్ ఆర్పీ రోడ్, ఆర్టీసీ బస్టాండ్ పక్కన ఉన్న ఏహెచ్ఎంవీ జూనియర్ కాళాశాలలో (సెంటర్ కోడ్: 12014) పరీక్ష రాశారు. నామినల్ రోల్లో కూడా సుచిత్ర సంతకం చేశారు. ఈ నెల 11న జరిగిన గ్రూప్-1 పరీక్షకు మొదటిసారి దరఖాస్తు చేసిన అభ్యర్థులు అందరికీ మళ్లీ అవకాశం కల్పించాం. హాల్‌టికెట్ల కోసం అభ్యర్థులకు మెసేజ్‌లు పంపించాం. అందులో సుచిత్రకు కూడా మెసేజ్ వెళ్లింది’ అని టీఎస్పీఎస్సీ వివరించింది.