హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాంస్కృతిక సారథిలో 583 మంది కళాకారులకు 30 శాతం పీఆర్సీ పెంచుతూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. దీంతో కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అందనున్నాయి. ప్రస్తుతం ఒక్కొక్కరికి రూ.24,514 వేతనం ఇస్తుండగా, 30 శాతం పీఆర్సీ పెంపుతో రూ.31,868 జీతం అందుకోనున్నారు. ఈ మేరకు రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, యువజన సర్వీసులశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పీఆర్సీ 2020 ప్రకా రం.. పెంచిన పీఆర్సీ 2021 జూన్ 1 నుంచి వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. తదుపరి చర్యలు తీసుకోవాలని భాషాసాంస్కృతిక శాఖ డైరెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో కళాకారులు సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్, సాంస్కృతిక సారథి చైర్మన్ బాలకిషన్, ఆ శాఖ సంచాలకులు హరికృష్ణకు టీఎస్ఎస్ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధానకార్యదర్శి యశ్పాల్, కళాకారులు ధన్యవాదాలు తెలిపారు.
దేవుడిలా మా బాధలు ఆలకించిన సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం. పాటలను నమ్ముకుని, పూటగడవని పరిస్థితులున్న మాకు సీఎం కేసీఆర్ 2015లో ప్రభుత్వ ఉద్యోగాలిచ్చారు. వేతనాలు పెరగలేదనే వెలితి నేటితో తీరిపోయింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు తీసుకోబోతున్నాం.
– యంగల కుమారి, టీఎస్ఎస్ గాయని
ప్రభుత్వ ఉద్యోగుల్లానే సాంసృతిక సారథి కళాకారులకు 30 శాతం పీఆర్సీ ప్రకటించటం సంతోషం. సీఎంకు ధన్యవాదాలు. ఈ మా అందరిలో నూతన ఉత్సాహాన్ని నింపింది.
– అభినయ శ్రీనివాస్, టీఎస్ఎస్ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు