మహబూబ్‌నగర్ అర్బన్, అక్టోబర్ 1 : అసెంబ్లీ ఎన్నికల సమయంలో అమలుకు సాధ్యం కాని హామీలను గుప్పించిన కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే వాటిని విస్మరించిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మోసాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ.. ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ ఉద్యమాన్ని ప్రారంభించిందని తెలిపారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో బాకీ కార్డులను విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ అబద్ధపు వాగ్దానాలు చేసిందని దుయ్యబట్టారు.
అధికార పార్టీ ఇచ్చిన హామీలను ప్రజలు మరిచిపోయారన్న భ్రమలో కాంగ్రెస్ నేతలు ఉన్నారని అన్నారు. అందుకే ప్రజలకు హామీలను గుర్తుచేసేందుకు బాకీ కార్డు ఉద్యమాన్ని చేపట్టినట్టు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల కోసం వచ్చే నాయకులను ప్రజలు నిలదీయాలని కోరారు. ఏది ఏమైనా బీఆర్ఎస్ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరని ఆయన స్పష్టంచేశారు.