గల్లీ నుంచి మొదలుకొని ఢిల్లీ దాకా ప్రతి ఒక్కరు సెంట్రల్ వర్సిటీ భూముల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ఖండిస్తున్నారు. పచ్చటి భూముల పరిరక్షణ కోసం విద్యార్థులు చేస్తున్న రణానికి మద్దతు పలుకుతున్నారు. కానీ, ఈ విద్యార్థులు ఘనత వహించిన మంత్రి పొంగులేటికి పెయిడ్ బ్యాచ్‌లా కనిపించారు. ‘విద్యార్థుల ముసుగులో ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నరు.. వాళ్లు స్టూడెంట్స్కాదు.. పేమెంట్ బ్యాచ్’ అని మంత్రి వ్యాఖ్యానించారు.
ఎవరు పేమెంట్ బ్యాచ్? అర్ధరాత్రి విధ్వంసానికి అల్లకల్లోలమై అరుస్తున్న జింకలా? రోదిస్తున్న నెమళ్లా? గగ్గోలు పెడుతున్న పక్షులా? కూలుతున్న వృక్షాలా? ఆ ఘోరాన్ని చూసి గుండెరగిలి ఉద్యమిస్తున్న విద్యార్థులా?
HCU | హైదరాబాద్, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ) : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార, ఇతర మంత్రులు కలిసి మంగళవారం మీడియా సమావేశంలో చెప్పిన వివరాలను పరిశీలిస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కాంగ్రెస్ చేసిన ద్రోహం తేటతెల్లమవుతున్నది. ‘హెచ్‌సీయూ మా కాంగ్రెస్ బ్రాండ్! ఇందిరాగాంధీ హయాంలో దాన్ని ఏర్పాటు చేసినం. 2,320 ఎకరాల స్థలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించింది’ అని మంత్రులు సెలవిచ్చారు. మరోవైపు ‘హెచ్‌సీయూ భూములకు ఇప్పటివరకు హకు పత్రాలు లేవు. యూనివర్సిటీ నుంచి గాని, విద్యార్థుల నుంచి గాని మాకు వినతిపత్రం ఇస్తే.. హకు పత్రాలు అందిస్తం’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార పేర్కొన్నారు. అంటే.. ఇందిరాగాంధీ హయాంలో 2,253 ఎకరాల కేటాయింపు అనేది నామమాత్రమేనని తేలిపోతున్నది. దీంతో ఉమ్మడి పాలకులు అవసరం వచ్చినప్పుడల్లా హెచ్‌సీయూ భూములకు ఎసరు పెట్టారు. వివిధ సంస్థలకు ఆ భూములను కేటాయిస్తూ వర్సిటీ విస్తీర్ణాన్ని కుదిస్తూ వచ్చారు. చంద్రబాబు హయాంలో ఐఎంజీ భారత్ కంపెనీకి 400 ఎకరాలు కేటాయించడం భూ పంపకానికి పరాకాష్ట! ఇప్పుడు ఇందిరమ్మ పాలన, ఇందిరమ్మ వారసులం అని చెప్పుకొనే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏకంగా ఆ 400 ఎకరాలను అమ్మకానికి పెడుతూ వర్సిటీకి ద్రోహం చేస్తున్నది.
ఇదీ అసలు కథ!
1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్నకాలం. నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఉద్యమాన్ని అణచివేసేందుకు అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నాటి ప్రధాని ఇందిరాగాంధీ స్వయంగా హైదరాబాద్‌కు వచ్చారు. తెలంగాణ ప్రాంతానికి సెంట్రల్ యూనివర్సిటీని కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. కంచె గచ్చిబౌలిలో 2,253 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ భూమిని ఎలాంటి వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించవద్దని, కేవలం ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ కోసమే వినియోగించాలని స్పష్టమైన షరతు విధించారు. కానీ, హెచ్సీయూకు ఇప్పటివరకు గుంట భూమి ఉన్నట్టుగా హకుపత్రం లేదు. దీంతో ప్రభుత్వాలు వర్సిటీ భూములను పప్పు బెల్లాల్లా పంచిపెట్టడం మొదలుపెట్టాయి. 2003లో చంద్రబాబు సరారు వర్సిటీకి చెందిన 400 ఎకరాల స్థలాన్ని ఐఎంజీ భారత్ అనే కంపెనీకి కేటాయించింది.
ఆ సమయంలో 400 ఎకరాలకు బదులుగా 537 ఎకరాలిస్తామని చెప్పింది. కానీ గోపన్‌పల్లిలో 397 ఎకరాలనే వర్సిటీకి ఇచ్చింది. మిగతా 140 ఎకరాల స్థలాన్ని ఇవ్వలేదు. ఇచ్చిన 397 ఎకరాల్లోనూ నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆదేశాల మేరకు టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్)కు 206 ఎకరాలు కేటాయించారు. ఆ తర్వాత నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (ఎన్ఐఏబీ)కి మరో 100 ఎకరాల స్థలాన్నిచ్చారు. అంటే పరిహారంగా ఇవ్వాల్సిన 140 ఎకరాలను ఇవ్వకపోగా, టీఐఎఫ్ఆర్, ఎన్ఐఏబీల కోసం 306 ఎకరాలు తీసుకున్నారు. అంటే యూనివర్సిటీ 446 ఎకరాలు కోల్పోయింది. కాబట్టి కోర్టు ఆదేశాలతో వచ్చిన 400 ఎకరాలు యూనివర్సిటీకి ఇస్తే నష్టం భర్తీ అయ్యేది. కాంగ్రెస్ ప్రభుత్వం వేలంలో అమ్మేస్తే వర్సిటీకి గుంట భూమి రాకపోగా 46 ఎకరాలను అదనంగా నష్టపోయినట్టవుతుంది. వర్సిటీ ఏర్పడిన నాటి నుంచి సుమారు 70 ఏండ్లలో అత్యధిక కాలం పాలించింది కాంగ్రెస్ నేతలే కదా? ఇన్నాళ్లుగా వర్సిటీ పేరిట గుంట భూమిని కూడా ఎందుకు రిజిస్ట్రేషన్ చేయలేదు? అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే 400 ఎకరాలను యూనివర్సిటీకి అప్పజెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
మీరే పెయిడ్ బ్యాచ్..
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): హెచ్‌సీయూ భూముల విషయంలో మంత్రి పొంగులేటి మంగళవారం మాట్లాడుతూ ‘విద్యార్థుల ముసుగులో బయటవారి అరాచకం’ అంటూ చేసిన వ్యాఖ్యలపై విద్యార్థులు భగ్గుమన్నారు. పొంగులేటి చెప్పే ‘పెయిడ్ బ్యాచ్’ పదాలు ఎన్ఎస్యూఐకి కూడా వర్తిస్తాయా? అంటూ వేణు అనే విద్యార్థి ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ సీఎం, మంత్రులు పెయిడ్ బ్యాచ్‌లా పనిచేస్తున్నారని మండిపడ్డారు.
హెచ్‌సీయూ విద్యార్థులు అడుగుతున్న ప్రశ్నలివి!
..వీటన్నింటికీ హెచ్‌సీయూ పూర్వ విద్యార్థులమని చెప్పుకొనే భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఏం సమాధానం చెప్తరు?
కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాలతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధం లేదు. ఆ భూములకు బదులు గోపనపల్లిలో 397 ఎకరాలను ఉమ్మడి రాష్ట్రంలోనే కేటాయించారు.
– మంగళవారం మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం
భట్టి విక్రమార చెప్పిన లెక ఇది!
వర్సిటీకి కేటాయించిన 397 ఎకరాల్లో 206 ఎకరాలను టాటా ఇనిస్టిట్యూట్ ఫర్ ఫండమెంటల్ రీసెర్చ్‌కు, 100 ఎకరాలను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ యానిమల్ బయోటెక్నాలజీకి కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టబెట్టింది. అంటే యూనివర్సిటీకి దకింది 91 ఎకరాలు మాత్రమే! అంటే పావు వంతు కూడా దకలేదు.
– మీడియాకు చెప్పకుండా భట్టి దాచిన సత్యమిది!
మొన్న.. పర్యావరణ పరిరక్షణపేరుతో అనేక మంది పేదల ఇండ్లను బుల్డోజర్లతో కూలగొట్టిందీ ప్రభుత్వం. నిన్న.. అభివృద్ధి పేరుతో, వాళ్లే చెప్పినట్టు ‘తొండలు గుడ్లు పెట్టని’ గిరిజన గూడేల వెంటబడిందీ ప్రభుత్వం. నేడు.. అరుదైన జీవజాలానికి ఆవాసమైన భూములను ధ్వంసం చేస్తూ సామూహిక హననానికి దిగిందీ ప్రభుత్వం. దీనికి కాంగ్రెస్ చెప్తున్న పేరు అభివృద్ధి! ఇది ప్రభుత్వమా? బుల్డోజర్ కంపెనీయా? మీరు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధా? రియల్ ఎస్టేట్ ఏజెంటా?
-ఇదీ సీఎం రేవంత్‌కు కేటీఆర్ వేసిన ప్రశ్న!
అభివృద్ధి పేరుతో చేస్తున్నది ఓ పిచ్చితనం.. దయచేసి ఎవరైనా దీన్ని ఆపండి.. – ప్రముఖ పొలిటిల్ కార్టూనిస్ట్ సతీశ్ ఆచార్య
ఇది ఎంతమాత్రం ఆమోదనీయం కాదు. రాహుల్‌గాంధీ వెంటనే చర్యలు తీసుకోవాలి. తెలంగాణలో జరుగుతున్న విధ్వంసాన్ని ఆపాలి. ; ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్‌రాఠీ
ప్రకృతికి వ్యతిరేకంగా సాగుతున్న ఈ ఆరాచకకాండ ఎంతమాత్రం సరికాదు. – సినీనటుడు ప్రకాశ్‌రాజ్