
హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రస్తుతం కొనసాగుతున్న కోర్సుల తొలగింపు, కొత్తకోర్సుల గుర్తింపునకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని పేర్కొనే జేఎన్టీయూ నిబంధన అమలును హైకోర్టు నిలిపివేసింది. ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో ప్రమేయం లేకుండా ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు గుర్తింపు ఇవ్వాలని జేఎన్టీయూను ఆదేశించింది. కొత్త కోర్సుల ప్రవేశానికి, ఉన్న కోర్సుల తొలగింపునకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిరభ్యంతర పత్రం పొందాలన్న నిబంధనను 11 ఇంజినీరింగ్ కాలేజీలు హైకోర్టులో సవాల్ చేశాయి. వీటిని ఇటీవల జస్టిస్ ఏ రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ టీ వినోద్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. జేఎన్టీయూ తరఫున న్యాయవాది వీ రామచంద్రగౌడ్ వాదిస్తూ, కొత్త విద్యా చట్టం ప్రకారం కొత్త విద్యా సంస్థల ఏర్పాటు, ఉన్న కాలేజీల్లో కోర్సుల తొలగింపు/కొత్తవి చేర్చడానికి యూనివర్సిటీ అనుమతి పొందాల్సి ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో విద్యావసరాలపై ప్రతి మూడేండ్లకు ఒకసారి సర్వే నిర్వహిస్తున్నామని, సర్వే ఫలితాలకు అనుగుణంగా విద్యావిధానాన్ని రూపొందించే అధికారం రాష్ట్రానికి ఉందని వివరించారు. ఇలాంటి సంసరణలు చేపట్టకపోతే పుట్టగొడుగుల్లా విద్యాసంస్థలు వస్తాయని అన్నారు. గడువు ఇస్తే కాలేజీలకు ఎన్వోసీ జారీచేస్తామని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. వాదనల తర్వాత హైకోర్టు.. కొత్త కోర్సుల గుర్తింపునకు రాష్ట్ర అనుమతి అవసరమన్న నిబంధన అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. విచారణను వాయిదా వేసింది.