ఎన్నటికైనా న్యాయమే గెలుస్తుందని ఈ తీర్పు ద్వారా వెల్లడైంది. పాలమూరుకు చెందిన ప్రధాన పార్టీల నేతలిద్దరు కుట్రపూరితంగా నాపై కేసు వేయించారు. నాపై కుట్ర చేసిన వారి పేర్లను త్వరలోనే ఆధారాలతో సహా వెల్లడిస్తా.
-మంత్రి శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): మహబూబ్‌నగర్ శాసనసభ్యుడిగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. శ్రీనివాస్‌గౌడ్ ఎన్నికను సవాల్ చేస్తూ అదే నియోజకవర్గానికి చెందిన ఓటరు సీహెచ్ రాజు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎం లక్ష్మణ్ మంగళవారం తీర్పు వెలువరించారు. రాష్ట్ర శాసనసభకు 2018లో జరిగిన ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నుంచి పోటీచేసిన శ్రీనివాస్‌గౌడ్.. నామినేషన్‌తోపాటు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌ను వెనక్కి తీసుకుని మార్పులు చేసి మరోసారి సమర్పించారని, ఇది చట్ట వ్యతిరేకమని, ఆయన ఎన్నికను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. అయితే పిటిషనర్ అభ్యంతరాన్ని హైకోర్టు తోసిపుచ్చింది. పిటిషనర్ తగిన ఆధారాలు చూపలేదని ఆక్షేపించింది. చట్ట ప్రకారమే ఎన్నికల అఫిడవిట్ దాఖలు చేశామన్న శ్రీనివాస్‌గౌడ్ వాదనను ఆమోదించింది. ఇరుపక్షాల వాదనలు ఈ నెల 9న ముగియడంతో హైకోర్టు తీర్పును రిజర్వులో ఉంచి మంగళవారం వెలువరించింది.
హైకోర్టులో న్యాయమే గెలిచింది: శ్రీనివాస్‌గౌడ్
హైకోర్టులో న్యాయమే గెలిచిందని.. త్వరలోనే ప్రతిపక్షాల కుట్రలను బయటపెడతానని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ఆయన ఎన్నిక సబబేనంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో సందడి నెలకొన్నది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున చేరుకొని పటాకులు కాల్చి.. మిఠా-యిలు తినిపించుకొని సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్నటికైనా న్యాయమే గెలుస్తుందని ఈ తీర్పు ద్వారా వెల్లడైందని అన్నారు. జిల్లాకు చెందిన ప్రధాన పార్టీల నేతలు ఇద్దరు తమ అస్తిత్వం కనుమరుగువుతున్నదని ఈ కుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు. బీసీ మంత్రినైన తనపై కేసు వేయించారని పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రజల హృదయాలను గెలిచి విజయం సాధించాలే తప్ప.. అక్రమ కేసుల ద్వారా తప్పుడు మార్గంలో గెలుపునకు ప్రయత్నించడం దుర్మార్గమని విమర్శించారు. జోగుళాంబ అమ్మవారు, మన్యంకొండ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఉన్నంతవరకు తప్పుడు ఆరోపణలు, కేసులు ఎక్కువ రోజులు నిలబడవని అన్నారు. తనపై కుట్ర చేసిన వారి పేర్లను ఆధారాలతో సహా వెల్లడిస్తానని, వారు ప్రజలకు తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిందేనని అన్నారు.