హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిపై అధ్యయనం చేయడానికి హర్యానాకు చెందిన పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థకు (హెచ్ఎస్ఐఐసీ) చెందిన ఉన్నతాధికారుల బృందం మంగళవారం హైదరాబాద్‌కు వచ్చింది. ఈ సందర్భంగా నగరంలోని టీ-హబ్ బహుళ అంతస్థుల భవనం, దండుమల్కాపూర్ ఎంఎస్ఎంఈ పార్క్, రావిర్యాల ఎలక్ట్రానిక్ మానుఫ్యాక్టరింగ్ క్లస్టర్‌ను సందర్శించింది. మొదట టీఎస్ ఐఐసీ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణలో నూతన పారిశ్రామిక వాడల అభివృద్ధి, టీ- హబ్ నిర్మాణం, ఐలాల నిర్వహణ విధివిధానాలపై అధ్యయనం చేశారు. ముఖ్యంగా టీ-హబ్ నిర్మాణంలో అనుసరించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, తదితర అంశాలపై వారు అమితాసక్తిని ప్రదర్శించారు.
బహుళ అంతస్థుల్లో టీ హబ్ కట్టడం శైలి అద్భుతంగా ఉందని, ఇంజినీరింగ్, సాంకేతిక పరిజ్ఞానంపై టీఎస్ ఐఐసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. హర్యానా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆ సంస్థ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, వీసీ అండ్ ఎండీ నర్సింహారెడ్డి, సీఈవో మధుసూదన్ , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఎస్ ఐఐసీ ఆధ్వర్యంలో ఎనిమిదేళ్లలో వేగవంతంగా జరుగుతున్న పారిశ్రామికాభివృద్ధిని హర్యానా అధికారులకు వివరించారు. హర్యానా అధికారుల బృందంలో.. ఆ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకు చెందిన ఈడీ సందీప్ చావ్లా, ఎలక్ట్రానిక్ మానుఫ్యాక్టరింగ్, లీగల్ సెల్ నోడల్ ఆఫీసర్ రాజీవ్ శర్మ, ఇంజినీరింగ్ డివిజన్ విభాగ అధిపతి అర్జున్ పాండే, రిలేషన్షిప్ వింగ్ మేనేజర్ హితేశ్ శర్మ, కన్సల్టెంట్ ప్రీతమ్ దేశ్‌ముఖ్ ఉన్నారు.
ఈ సందర్భంగా టీఎస్ ఐఐటీ చైర్మన్ బాలమల్లు, ఎండీ నర్సింహారెడ్డి మాట్లాడుతూ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతం పారిశ్రామీకరణలో తీవ్ర వివక్షకు గురైనందున 14 ప్రాధాన్యత రంగాల్లో కొత్త పారిశ్రామికవాడలను పెద్ద ఎత్తున నిర్మిస్తున్నామని టీఎస్ ఐఐసీ తెలిపారు. పరిశ్రమల స్థాపనకు రాష్ట్రంలో 1.45 లక్షల ఎకరాల భూములను గుర్తించామని, ఈ భూములను భారీ పరిశ్రమలకు కేటాయించడమే కాకుండా, ఎంఎస్ఎంఈ యూనిట్లు నెలకొల్పేలా అన్ని జిల్లాల్లోనూ కొత్త పారిశ్రామికవాడలను వేగంగా అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.
భారీ పెట్టుబడులు, ఉపాధి కల్పన లక్ష్యంగా మెగా ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేస్తూనే, మరోవైపు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించే చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. ఇందులో భాగంగానే ఎనిమిదేళ్ల కాలంలో 30-40వేల ఎకరాల్లో 152 కొత్త ఇండస్ట్రియల్ పార్కులు అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేసే దిశగా టీఎస్ ఐఐసీ అమలు చేస్తున్న విధానాలు, అనుసరిస్తున్న సాంకేతిక పద్ధతులను ఈ సందర్భంగా హర్యానా అధికారులకు వివరించారు. సమావేశంలో టీఎస్ ఐఐసీ చీఫ్ ఇంజినీర్ శ్యామ్‌సుందర్, సీజీఎం సునీతా బాయి, జీఎం రేవతిబాయి, జోనల్ మేనేజర్లు, డీజీఎంలు, తదితర అధికారులు పాల్గొన్నారు.