హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): కొల్లాపూర్ నియోజకవర్గంలో క్రిమినల్స్‌కు కొమ్ముకాస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావును మంత్రి పదవి నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి తమ్ముడు రాజశేఖర్‌రెడ్డి ఇంట్లో పనిచేస్తున్న బాలిక ఆత్మహత్యకు కారణమైన బండ్ల కుటుంబంపై సమగ్ర విచారణ జరపాలని, రాజశేఖర్‌రెడ్డిపై కేసు హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి జూపల్లి కేసును పకదారి పట్టించేందుకు పోలీసు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు.
కొల్లాపూర్ నియోజకవర్గంలో ప్రత్యర్థులపై జూపల్లి కేసులు పెట్టి వేధిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ తెలంగాణభవన్‌లో గురువారం ఆయన బీఆర్ఎస్ నేతలు అభిలాశ్ రంగినేని, కుర్వ విజయ్‌కుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. మంత్రిగా జూపల్లి కృష్ణారావు ఈ 11 నెలల్లో నాలుగు దేశాలు తిరిగి తెలంగాణకు ఏం ఒరగబెట్టారని ప్రశ్నించారు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డిని తిట్టిన జూపల్లి.. ఇప్పుడు ఆయన మెప్పు కోసం కేటీఆర్, హరీశ్‌రావును విమర్శిస్తున్నారని మండిపడ్డారు. జూపల్లికి రాజకీయ విలువలు లేవని, ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వ్యక్తి అని విమర్శించారు.
చంద్రబాబు ఆదేశంలో కాంగ్రెస్ పనిచేస్తున్నదని గతంలో మాట్లాడిన జూపల్లి ఇప్పుడు ఎవరి ఆదేశాలతో పనిచేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. హరీశ్‌రావును విమర్శిస్తున్న జూపల్లి.. కొల్లాపూర్‌ను సిద్దిపేట తరహాలో ఎందుకు అభివృద్ధి చేయడం లేదని నిలదీశారు. కొల్లాపూర్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. కొల్లాపూర్‌లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, అధిక క్రైమ్‌రేటు ఇక్కడే నమోదవుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీధర్‌రెడ్డి హత్య జరిగి ఏడునెలలైనా ఇప్పటివరకు నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.