హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలి, రేవంత్‌రెడ్డి సర్కార్ రియల్ ఎస్టేట్ ఏజెన్సీలా మారిపోయిందని, హైదరాబాద్ నడిమధ్యన ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని రూ.500 కోట్ల విలువైన ఆయిల్‌ఫెడ్ భూములను ప్రైవేట్‌కు ధారాదత్తం చేయడమే ఇందుకు నిదర్శనమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. బహిరంగ మారెట్లో రూ.500 కోట్లు పలికే ఈ ఖరీదైన భూమిని కేవలం రూ.87 కోట్లకే ఓ ప్రైవేట్ వ్యక్తికి కట్టబెట్టే భారీ కుట్ర జరుగుతున్నదని హరీశ్‌రావు విమర్శించారు.
ఆ రూ.87 కోట్లు చెల్లించడానికి ఆయిల్‌ఫెడ్ సిద్ధంగా ఉన్నా, ప్రైవేట్ వైపే మొగ్గుచూపడం వెనుక ఉన్న మతలబు ఏందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయిల్‌ఫెడ్‌కు కేవలం 1,800 గజాలు విసిరేసి, మిగతా అత్యంత విలువైన భూమినంతా ప్రైవేట్ పరం చేయాలని చూడటం వెనుక భారీ కుంభకోణం దాగి ఉన్నదని మండిపడ్డారు. తక్షణమే ఈ అక్రమ కేటాయింపును రద్దు చేసి, ఆయిల్‌ఫెడ్‌కే దకేలా ఫ్రీహోల్డ్ హకులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనకి తీసుకొనే దాకా ప్రజాపక్షాన పోరాటం చేస్తామని తేల్చిచెప్పారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆస్తులను కమీషన్ల కోసం ప్రైవేట్‌పరం చేయడాన్ని ఆక్షేపిస్తూ ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు.
అజామాబాద్ భూములకు సుదీర్ఘ న్యాయపోరాట చరిత్ర ఉన్నదని హరీశ్‌రావు లేఖలో గుర్తుచేశారు. 1954లో ఆయిల్‌మిల్లు నడుపడం కోసం ఈ ప్లాటును ఒక ప్రైవేట్ సంస్థకు లీజుకు ఇస్తే, వారు నిబంధనలను తుంగలో తొకి మొదటి ఏడాదిలోనే మిల్లును మూసివేసి అక్రమంగా సబ్ లీజులకు ఇచ్చి సొమ్ము చేసుకున్నారని ఆయన తెలిపారు. దీనిపై స్పందించిన అప్పటి ప్రభుత్వం 1974లో లీజును రద్దు చేసిందని, దీనిపై సదరు సంస్థ సుప్రీంకోర్టు వరకు వెళ్లినా చుకెదురైందని వివరించారు. 1987లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆ ప్రైవేట్ సంస్థకు కేవలం 1,277 గజాల భూమి మాత్రమే మిగిలిందని, మిగిలిన 15,984 గజాల(3 ఎకరాల 23 గుంటల) భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని 1991లో జీవో నంబర్ 93 ద్వారా ఆయిల్‌ఫెడ్‌కు అప్పగించిందని హరీశ్‌రావు గుర్తుచేశారు.
అప్పటినుంచి మూడు దశాబ్దాలుగా ఆ భూమిలో ఆయిల్‌ఫెడ్ తన కార్యకలాపాలను కొనసాగిస్తూ, ఆ ప్రభుత్వ ఆస్తిని కాపాడుకుంటున్నదని స్పష్టంచేశారు. 2003లో రద్దయిన లీజును జీవో 366 ద్వారా పునరుద్ధరించే యత్నం జరుగగా, దానిపై 2015లో ప్రభుత్వమే షోకాజ్ నోటీసు ఇచ్చిందని, 2022లో హైకోర్టు కూడా దీనిపై ప్రభుత్వానిదే తుది నిర్ణయమని ఆదేశించిందని హరీశ్‌రావు తెలిపారు. చట్టం, రికార్డులు, కోర్టు తీర్పులు అన్నీ ప్రభుత్వానికే అనుకూలంగా ఉన్నా, ప్రస్తుత ప్రభుత్వం ఆ తీర్పులను కాదని అక్రమాలకు తెరతీసిందని ఆరోపించారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడూ ప్రైవేట్ శక్తులకు తలొగ్గకుండా వందల కోట్ల ప్రభుత్వ ఆస్తిని చిత్తశుద్ధితో కాపాడామని, కానీ కాంగ్రెస్ రాగానే పేదల పొట్టగొట్టి పెద్దలకు పల్లీలు, బఠానీల్లా భూములను పంచుతున్నదని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఒకవైపు సామాన్యుల ఇండ్లను 22ఏ జాబితాలో పెట్టి వేధిస్తూ, మరోవైపు ఖరీదైన ప్రభుత్వ భూములను కమీషన్ల కోసం కారుచౌకగా అమ్ముతున్నారని దుయ్యబట్టారు.