Harish Rao | 22A జాబితాను వెంటనే రద్దు చేయకపోతే అసెంబ్లీని స్తంభింపజేస్తాం.. సచివాలయాన్ని ముట్టడిస్తామని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు హెచ్చరించారు. ప్రజల ఆస్తులను లాక్కుంటే కాంగ్రెస్ పార్టీ మాడి మసైపోవడం ఖాయమని అన్నారు.
హైదరాబాద్ బోడుప్పల్ పరిధిలోని తిరుమల మెడోస్, లక్ష్మీ గణపతి, హేమానగర్ కాలనీలను ప్రభుత్వం అకారణంగా 22A నిషేధిత జాబితా లో చేర్చిన నేపథ్యంలో.. తీవ్ర ఆందోళనలో ఉన్న ఆయా కాలనీల వాసులకు బాసటగా నిలిచేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు గారు హాజరై బాధితులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి, పొంగులేటి రాష్ట్రాన్ని అడ్డం పెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే రాహుల్ గాంధీ చోద్యం చూస్తున్నారా అని ప్రశ్నించారు. 30 శాతం కమీషన్ల కోసమే పక్కా రిజిస్టర్డ్ ఇళ్లను నిషేధిత జాబితాలో పెడుతున్నారని విమర్శించారు. భూభారతి పోర్టల్ నుంచి 22A జాబితాను రాత్రికి రాత్రే ఎందుకు మాయం చేశారు? పబ్లిక్ డొమైన్లో పెట్టాలని డిమాండ్ చేశారు.
ఒక ప్రభుత్వం అనేది ప్రజల సమస్యలు పరిష్కరించాలి.. ప్రజల ఇబ్బందులు తొలగించడానికి పని చేయాలి.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు లేని సమస్యలు సృష్టించి వారిని తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు. మధ్యతరగతి కుటుంబాలు కడుపుకట్టుకుని, పచ్చడి మెతుకులు తిని, రూపాయి రూపాయి కూడబెట్టుకుని బ్యాంకుల్లో అప్పులు తెచ్చి ఇళ్లు కట్టుకుంటారని తెలిపారు.
“ఇక్కడ సమావేశంలో స్వప్న అనే సోదరి మాట్లాడుతూ.. పిల్లల పైచదువుల కోసం విదేశాలకు పంపేందుకు ఇల్లు కుదువబెట్టి లోన్ తీసుకుందామంటే మా ఇల్లు 22A లో ఉందని బ్యాంకులు అప్పు ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేసింది. బిడ్డ పెళ్లికో, ఆపదకో ఇల్లు అమ్ముకుందామన్నా అమ్ముకోలేని అయోమయ పరిస్థితిలోకి నెట్టేశారు. 1998లో, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాం 2008లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ ను ఎత్తేశారు. ఎప్పుడో రద్దయిన చట్టాన్ని మళ్లీ తెచ్చి, పట్టా భూములను 22A నిషేధిత జాబితాలో పెట్టి వసూళ్లకు పాల్పడాలని చూస్తున్నారు.” అని హరీశ్‌రావు తెలిపారు.
ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం తన ప్రభుత్వ భూములను, ఎస్సీల అసైన్డ్ భూములను సైతం తెగనమ్ముతోందని హరీశ్‌రావు అన్నారు.. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులో ఉన్న 1000 గజాల పార్కును కూడా అమ్మకానికి పెట్టారని తెలిపారు. ఆఖరికి గుడి కట్టడానికో, బడి కట్టడానికో, దవాఖానాకో, స్మశానానికో కూడా జాగ లేని పరిస్థితి సృష్టించారని మండిపడ్డారు. మరోవైపు కూకట్ పల్లిలోని 1000 గజాల ప్రైవేటు ప్లే గ్రౌండ్‌ను కూడా ప్రభుత్వం తనదే అంటోందని అన్నారు.
రాత్రికి రాత్రే ఇళ్లను ULC కింద 22A లో దేనికోసం పెడుతున్నారు? ఇదంతా కేవలం 30 శాతం కమీషన్లు లాగడానికే. దళారులు వెళ్లి యజమానులను 30 శాతం కమీషన్ అడుగుతున్నారని తెలిపారు. తప్పు చేసి నిషేధిత జాబితాలో పెట్టింది మీరు.. మీ కమీషన్ల కోసం చేసిన తప్పుకు సామాన్య ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ ఎందుకు తిరగాలి? ఎందుకు అప్లికేషన్లు పెట్టుకోవాలి? అని ప్రశ్నించారు. ఇలా ప్రజలను ఆఫీసుల చుట్టూ తిప్పుకోవాలని ఆలోచించడమే కాంగ్రెస్ ప్రభుత్వ తుగ్లక్ చర్య అని మండిపడ్డారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు.. తప్పు చేసింది మీరు, కేవలం క్షమాపణలు చెప్పి తప్పించుకోవాలని చూడకండని హరీశ్‌రావు సూచించారు. అప్లికేషన్లతో సంబంధం లేకుండా ఆ భూములను 22A నుంచి తొలగించాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. అధికారులు చేసిన తప్పు వెనుక దాక్కుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా ఏకంగా 40 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టారు. ఆఖరికి అమీన్పూర్ పోలీస్ స్టేషన్ కూడా 22A లోనే ఉందని హరీశ్‌రావు తెలిపారు. మొత్తం హైదరాబాద్ అంతా.. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సరూర్ నగర్ లాంటి ప్రాంతాలన్నీ ఈ జాబితాలోనే ఉండటం ఈ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు. యాదాద్రి జిల్లాలో 40 వేల ఎకరాలు నిషేధిత జాబితాలో ఉన్నాయని స్వయంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డే చెప్పారని గుర్తుచేశారు. చిన్న చిన్న విషయాలకు సీఐడీ, విజిలెన్స్ ఎంక్వయిరీలు వేసి బీఆర్ఎస్ నాయకులను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం.. మరీ ఇంతపెద్ద తుగ్లక్ నిర్ణయం తీసుకున్న అధికారులపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.
ఢిల్లీలో ‘నీట్’ పరీక్ష పేపర్ లీకు గురించి యువత తిరగబడితే.. కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చిందని హరీశ్‌రావు గుర్తుచేశారు. నువ్వు చేసిన అవినీతి, స్కాములను ప్రజలు ఇన్నాళ్లూ భరించారు.. కానీ ఇప్పుడు వాళ్ల సొంత ఇళ్లనే లాక్కుంటే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదన్నారు. తక్షణమే ఈ సమస్య పరిష్కరిస్తారా? లేక ప్రజల పాదాల కింద నలిగిపోతారో తేల్చుకోండని హెచ్చరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ ఈ రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలో పెట్టిందని హరీశ్‌రావు విమర్శించారు.. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరూ రియల్ ఎస్టేట్ వ్యాపారులే అని తెలిపారు. వీళ్లు రాష్ట్రాన్ని అడ్డం పెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే.. రాహుల్ గాంధీ చోద్యం చూస్తున్నారా అని ప్రశ్నించారు. మీకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం మాత్రమే తెలుసు.. కానీ బీఆర్ఎస్ పార్టీకి ప్రజల పక్షాన పోరాటం చేయడం తెలుసునని తెలిపారు. మీ మెడలు వంచడం తెలుసు. మీ మెడలు వంచైనా సరే ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని హరీశ్‌రావు అన్నారు. ప్రజల ఇళ్లను 22A జాబితా నుంచి తొలగించకపోతే అసెంబ్లీని స్తంభింపజేస్తామని.. అవసరమైతే సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎటువంటి పోరాటానికైనా బీఆర్ఎస్ సిద్ధం. ఈ జాబితాలను తొలగించకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాడి మసైపోవడం ఖాయమని స్పష్టం చేశారు.
వాస్తవానికి ఆన్లైన్లో భూభారతి రిజిస్ట్రేషన్ పోర్టల్‌లో 22A నిషేధిత జాబితాలను ప్రభుత్వం పూర్తిగా మాయం చేసిందని హరీశ్‌రావు తెలిపారు. మొత్తం హైదరాబాద్ నగరాన్నే ఈ పోర్టల్ నుంచి బ్లాక్ చేశారు. ఎందుకు రాత్రికి రాత్రి ఈ పోర్టల్‌ను మాయం చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఈ బ్లాకింగ్ పేరు మీద రేవంత్ రెడ్డి అండ్ బ్యాచ్ ఇంకేమైనా విలువైన ల్యాండ్లను కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారా? తక్షణమే 22A ప్రొహిబిషన్ జాబితాను పబ్లిక్ డొమైన్లో ఉంచాలని, వివరాలు బయటపెట్టాలని బీఆర్ఎస్ పక్షాన తీవ్రంగా డిమాండ్ చేశారు.