గుమ్మడిదల, ఫిబ్రవరి 14: గుమ్మడిదలను మరో లగచర్లగా మారిస్తే సహించేది లేదని, ఇక్కడి రైతులే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలను ఆగం చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం డంపింగ్‌యార్డు నిర్మాణం చేపట్టిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి పంచాయతీ పరిధి ప్యారానగర్ అటవీ ప్రాంతంలో జీహెచ్ఎంసీ డంపింగ్‌యార్డును వ్యతిరేకిస్తూ గుమ్మిడిదలలో రైతు జేఏసీ కమిటీ అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షకు హరీశ్‌రావు, నర్సాపూర్, జహీరాబాద్, సంగారెడ్డి ఎమ్మెల్యేలు సునీతారెడ్డి, మాణిక్‌రావు, చింతాప్రభాకర్, బీఆర్ఎస్ రాష్ట్ర యూత్ అధ్యక్షుడు శంభీపూర్ రాజు, డీసీసీబీ చైర్మన్ శివకుమార్, సీనియర్ నాయకుడు జైపాల్‌రెడ్డి తదితరులు శుక్రవారం సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ కళకళాడుతున్న గ్రామాల్లో డంపింగ్‌యార్డుతో ఇక్కడి గ్రామాల ప్రజల బతుకుల్లో ప్రభుత్వం కుంపటి పెడుతున్నదని మండిపడ్డారు. ఫ్యారానగర్లో డంపింగ్‌యార్డు వల్ల గుమ్మడిదల, నర్సాపూర్, శివంపేట మండలాల్లో గాలి, నీరు, భూమి కలుషితమై ప్రజలు రోగాల బారిన పడతారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్యారానగర్ అటవీ ప్రాంతంలో డంపింగ్‌యార్డు నిర్మాణం కోసం పది రోజుల క్రితం మంగళవారం అర్ధరాత్రి ఒక్కసారిగా పోలీస్ బలగాలు ఇక్కడి గ్రామాలపైకి వచ్చి నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసి సంగారెడ్డికి తరలించడం ఎమర్జెన్సీ పాలన కాదా అని సర్కారును నిలదీశారు.
తమ మొగోళ్లను పోలీస్‌లు పట్టుకపోతే ఇండ్లలో ఉన్న మహిళలు ఎంతబాధ అనుభవించారో సీఎం రేవంత్‌రెడ్డికి తెలియదా అని మండిపడ్డారు. రాత్రుళ్లు నిద్ర లేకుండా భయభ్రాంతులతో కాలం వెల్లదీస్తుంటే జీహెచ్ఎంసీ అధికారులు వందల సంఖ్యలో టిప్పర్లతో డంపింగ్‌యార్డు పనులను రాత్రికిరాత్రే చేయడం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించారు. ఇంత క్రూరంగా సీఎం రేవంత్‌రెడ్డి సర్కారు ఆలోచిస్తుంటే ప్రజాపాలన ఎందుకైతదని, ఇది మూ మ్మాటికీ రాక్షస రాజ్యమైందని నిప్పులు చెరిగారు.
ఇక్కడి గ్రామాల ప్రజలు బంగారం వంటి పంటలు పండిస్తున్నారని, వారి భూములను సాగుకు పనికి రాకుండా చేసి మరో లగచర్లగా మార్చవద్దని హెచ్చరించారు. డంపింగ్‌యార్డుకు దిగువ ప్రాంతంలో ఉన్న నర్సాపూర్ రాయచెరువు పర్యాటకానికి చిరునామాగా ఉన్నదని, డంపింగ్‌యార్డుతో ఇది పూర్తిగా కలుషితమై సాగుకు యోగ్యం కాకుండా పోతుందని, మత్స్యకారుల పరిస్థితి దారుణంగా మారుతుందని ఆందోళన చెందారు. దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి పది కిలోమీటర్ల దూరంలోనే డంపింగ్ యార్డు ఏర్పాటైతే పక్షులు, గద్దలు, పెద్ద పక్షుల వల్ల ఫ్లయింగ్ జోన్‌కు అడ్డు వస్తదని, ఇప్పటికే రైతు జేఏసీ నాయకులు కమాండర్‌కు వినతి పత్రాన్ని అందజేశారని, ఆ కమాండర్ కలెక్టర్‌కు, తమ పై అధికారులకు లేటర్ పంపినట్టు సమాచారం ఉన్నదని చెప్పారు.
డంపింగ్‌యార్డు పనులు నిలిపి వేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసినా ఇక్కడి ప్రధాన గేటు పనులు, రోడ్డు పనులు సాగుతున్నాయని, దీనికి కలెక్టర్ బాధ్యులవుతారని సూచించారు. అసెంబ్లీ వేదికగా ఈ సమస్యపై పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల నిర్ణయాన్ని గౌరవించి డంపింగ్‌యార్డు ఏర్పాటును తక్షణమే రద్దు చేయాలని, లేదంటే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించికోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో రామచంద్రాపురం సీనియర్ నాయకుడు ఆదర్శ్‌రెడ్డి, కొలను బాల్‌రెడ్డి, జీ వెంకటేశంగౌడ్, రాజేశ్, చంద్రాగౌడ్, చిమ్ముల గోవర్ధన్‌రెడ్డి, కొత్తపల్లి ప్రభాకర్, యావన్నగాని సంతోష్‌రెడ్డి, చిమ్ముల నర్సింహారెడ్డి, రాజశేఖర్, ఆలేటి శ్రీనివాస్‌రెడ్డి, రైతు సంఘం అధ్యక్షుడు సదానందరెడ్డి, ఆలయకమిటీ అధ్యక్షుడు మద్దుల బాల్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): సంగమేశ్వర, బసవేశ్వర సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ నిర్వీర్యం చేసిన నేపథ్యంలో వాటిని పూర్తి చేసే దాకా ఉమ్మడి కార్యాచరణను అమలు చేస్తూ సర్కారు తీరును ఎండగడదామని, నీటి కోసం మరో పోరాటానికి సిద్ధమవుదామని మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. రైతులకు మేలు జరిగేలా భవిష్యత్తు కార్యాచరణ చేపడదామని తెలిపారు. శుక్రవారం కోకాపేటలోని తన నివాసంలో సంగారెడ్డి జిల్లా పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల పనులు ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై సమాలోచనలు చేశారు. జహీరాబాద్, సంగారెడ్డి, నారాయణ ఖేడ్, అందోల్ నియోజకవర్గాల్లోని గులాబీ శ్రేణులను నీటి పోరాటానికి సమాయత్తం చేసి, 4 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు ఆరాటపడిన కేసీఆర్ ఆకాంక్షను నెరవేరుద్దామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు సునితా లక్ష్మారెడ్డి , చింతా ప్రభాకర్, మాణిక్ రావు, మాజీ ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, జడ్పీ మాజీ చైర్మన్ జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
గతనెల 31న సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండలం వేదపల్లి నుంచి 140 కిలోమీటర్లు పాదయాత్ర చేసి కేసీఆర్‌ను కలిసేందుకు వచ్చిన సందర్భంలో ఆయన హరీశ్‌కు పోరాట కార్యాచరణ రూపొందించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టు పనులను వెంటనే పూర్తి చేయాలనే డిమాండ్‌తో ప్రాజెక్టుల నిర్దేశిత ఆయకట్టు ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. 2022 ఫిబ్రవరి 21న నారాయణ్ ఖేడ్‌లో ప్రాజెక్ట్ పనులకు గత సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాజెక్టుల వైపు తొంగి చూడలేదని సమావేశంలో నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో కదలిక తెచ్చి, ప్రాజెక్టులు పూర్తి చేయించి, దాదాపు 4 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటానికి సంసిద్ధులయ్యారు.