సిద్దిపేట, మే 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి): రేవంత్‌రెడ్డి సర్కారు కమీషన్ల కోసం, జేబులు నింపుకోవడానికి, ఢిల్లీకి కప్పం కట్టడానికి రూ.లక్ష కోట్ల టెండర్లు పిలుస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘రైతులకు పంట రుణమాఫీ చేయమంటే పైసలు లేవు, రైతుబంధు ఇవ్వమంటే పైసలు లేవు. వానకాలం రైతుబంధు ఇవ్వలేదు. యాసంగిలో సగం మందికి కూడా ఇవ్వలేదు. కానీ, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌లో రూ.10 వేల కోట్లు, జీహెచ్ఎంసీలో రూ.7,000 కోట్లు, హెచ్ఎండీఏలో రూ.20 వేల కోట్లతో టెండర్లు పిలిచారు. ఫ్యూచర్‌సిటీలో రేవంత్‌రెడ్డి భూము లు కొనుకున్నాడట. ఆరు లైన్ రోడ్డు వేసుకోవడానికి రూ.4,000 కోట్లు ఖర్చు చేస్తున్నరు. వీటన్నిటికీ డబ్బులు ఎకడినుంచి వసున్నాయి’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
మత్స్యకారులకు, కులవృత్తులకు ఉపాధి కల్పించమంటే డబ్బులు లేవంటున్నారని దుయ్యబట్టారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో రేవంత్‌రెడ్డికి బుద్ధి చెప్తారని హెచ్చరించారు. సోమవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ముదిరాజ్తో కలసి కొరవి కృష్ణస్వామి ముదిరాజ్, పండుగ సాయన్న ముదిరాజ్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. జీలుగ విత్తనాలు ఇవ్వడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. అందాల పోటీల నిర్వహణకు పైసలున్నాయి కానీ, విత్తనాలు, చేపపిల్లలు ఇవ్వడానికి పైసల్లేవా? అని నిలదీశారు. ఎవరి కడుపు నింపడానికి ఈ పోటీలు నిర్వహిస్తున్నారో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు.
విగ్రహాలను ఆవిషరించడం ఎంత ముఖ్య మో వారిని జీవితంలో ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లడం కూడా అంతే ముఖ్యమని హరీశ్‌రావు ఉద్బోధించారు. కృష్ణస్వామి ముదిరాజ్ హైదరాబాద్ తొలి మేయర్‌గా ముదిరాజ్ సమాజానికి చేసిన కృషి ఎంతో గొప్పదని వివరించారు. పండుగ సాయన్న పేదల కోసం పోరాడి చివరికి ప్రాణాలను వదిలడం ఎందరికో ఆదర్శమని చెప్పారు. కానిస్టేబుల్ కిష్టయ్య తెలంగాణ సాధన కోసం ప్రా ణత్యాగం చేసి చరిత్రపుటల్లో నిలిచిపోయారని గుర్తుచేసుకున్నారు. కానిస్టేబుల్ కిష్టయ్య విగ్రహాలను అనేకచోట్ల ఏర్పాటుచేసుకున్నామని చెప్పారు. ఆయన కుటుంబాన్ని కేసీఆర్ ఆదుకున్నారని, వారి కూతుర్ని ఎంబీబీఎస్ చదివించారని, ఇప్పుడు పీజీ చదివిస్తున్నారని తెలిపారు.
ఈ ఏడాదైనా రాష్ట్రంలోని అన్ని చెరువులు, కుంటల్లో చేపపిల్లను వదలాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో రూ.1,000 కోట్లు ఖర్చు చేసి ముదిరాజులకు బండ్లు, ఆటోలు, పడవలు, వలల కోసం ఆర్థిక సాయం అందించామని, ఏటా రూ.120 కోట్లు ఖర్చు చేసి ఉచితంగా చేపపిల్లలు, రొయ్యలను చెరువులు, ప్రాజెక్టుల్లో విడుదల చేశామని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సగం జిల్లాల చెరువుల్లో కూడా చేపపిల్లలను వదలలేదని విమర్శించారు. జూన్ వస్తున్నా ప్రభుత్వం చేపపిల్లల టెండర్లు పిలవలేదని, దీంతో ముదిరాజుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నదో స్పష్టమవుతున్నదని దుయ్యబట్టారు. చేపపిల్లలను చెరువుల్లో వదలకపోతే ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.