హైదరాబాద్: తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు ఆద్యుడు, ఇరిగేషన్ రంగంలో ప్రఖ్యాత ఇంజినీరు నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ చెరగని ముద్ర వేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ఆయన జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. సర్ ఆర్థర్ కాటన్, కేఎల్ రావు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య వంటి దిగ్గజాల సరసన నిలిచిన గొప్ప ఇంజినీర్ మన తెలంగాణలో పుట్టడం మనందరికీ గర్వకారణన్నారు. నవాబ్ అలీ నవాజ్ జంగ్ నిర్మించిన నిజాం సాగర్ను కాళేశ్వరం జలాలతో నింపి బీఆర్ఎస్ ప్రభుత్వం సజీవంగా మార్చిందని తెలిపారు.
అంతటి మహానీయుడి సేవలను ప్రస్తుత, భవిష్యత్తు తరాలు స్మరించేలా నవాజ్ జంగ్ జన్మదినాన్ని తెలంగాణ ఇంజినీర్స్ డేగా జరపాలని నిర్ణయించిన గౌరవించింది తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ఇంజినీర్ల పాత్ర అమోఘమైనదని వెల్లడించారు. నవాజ్ జంగ్ను స్ఫూర్తిగా తీసుకొని జాతి నిర్మాణం కోసం ఇంజినీర్లు మరింతగా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఇంజినీర్స్ డే సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.