అశ్వాపురం/హైదరాబాద్, జూలై 12 (నమస్తేతెలంగాణ): ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సాగు, తాగునీరు అందించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా సీతారామ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది. సాగునీటికి ఇబ్బంది లేకుండా రైతులు పంటలు పండించుకునేందుకు, ప్రజలు తాగునీటికి అవస్థలు పడకుండా పుష్కలంగా నీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆచరణలో పెట్టడంతో ఇటు రైతులకు, అటు ప్రజలకు వరం కానున్నది. నాడు కేసీఆర్ కట్టించిన సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం కాబోతున్నదని రైతులు సంబురపడుతున్నారు.
ఇదంతా గత కేసీఆర్ ప్రభుత్వ చలవే అని రైతులు గుర్తుచేసుకుంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వం రెండు జిల్లాలకు సాగునీరు ఇచ్చేలా ప్లాన్ చేసినా.. కాంగ్రెస్ సర్కారు మాత్రం కేవలం ఖమ్మానికే నీరు ఇవ్వాలని చేసిన కుఠిల రాజకీయాన్ని బీఆర్ఎస్ తిప్పికొట్టింది. ‘చలో పూసుగూడెం’ పేరుతో పది రోజుల క్రితం పెద్దఎత్తున భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగితే పోలీసులు నాయకులను అరెస్టు చేసి సదరు కార్యక్రమాన్ని విఫలం చేశారు. అయినా పోరాటం ఆగదని ప్రకటన చేయడంతో దిగొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని విడుదల చేసింది.
అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద ఉన్న సీతారామ ప్రాజెక్టు మొదటి పంపుహౌస్ నుంచి శనివారం నీటిని విడుదల చేశారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధికారులతో కలిసి పూజలు చేసిన అనంతరం పంపుహౌస్ మొదటి మోటర్ స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రస్తుతానికి గోదావరిలో 8.50 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నది. ఈ క్రమంలో రోజూ 1,500 క్యూసెక్కుల నీటిని పంటల సాగుకు వినియోగించుకునేందుకు మొదటి పంపుహౌస్ నుంచి నీటిని విడుదల చేశారు.
శనివారం నీటిని విడుదల చేయడంతో నాలుగు రోజుల్లో ఖమ్మం జిల్లా ఏన్కూరు వద్ద గల ఎన్నెస్పీ లింకు కెనాల్‌కు ఆ నీరు చేరుకుంటుంది. ఆ నీటిని వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల పరిధిలోని రైతులు 60 వేల ఎకరాలకు పారించుకునే అవకాశం ఉంటుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాలకు త్వరలోనే ప్యాకేజీ పనులు పూర్తిచేసి సాగునీరు అందించనున్నట్టు స్థానిక ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో సీతారామ ప్రాజెక్టు ఎస్ఈలు రవికుమార్, శ్రీనివాసరెడ్డి, ఈఈ తెల్లం వెంకటేశ్వర్లు, డీఈ శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ మణిధర్, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ఒత్తిడితో ఎట్టకేలకు దిగొచ్చిన సర్కారు సీతారామ ప్రాజెక్టు మోటర్లను ఆన్ చేయడం సంతోషకరమని నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కేసీఆర్ ముందుచూపుతో గోదావరి జలాలను ఖమ్మం జిల్లాకు తరలించి సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో నిర్మించిన సీతారామ ప్రాజెక్టు ఫలాలు రైతులకు అందడం ఆనందంగా ఉన్నదని అన్నారు.
పొలాలకు చేరిన నీళ్లను చూసిన రైతులు కేసీఆర్ కృషిని గుర్తు చేసుకుంటున్నారని శనివారం ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. గోదావరి జలాలను కృష్ణా జలాలతో అనుసంధానం చేసే ఈ ప్రాజెక్టు విలువ ఇప్పుడు తెలిసొచ్చిందని అన్నారు. నదీ జలాల సద్వినియోగానికి కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేశారని చెప్పడానికి సీతారామ ప్రాజెక్టు సజీవ సాక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు మోటర్లను ఆన్చేసినట్టే కన్నెపల్లి మోటర్లను సైతం నడపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గోదావరి జలాల కోసం కాళేశ్వరం ఆయకట్టు రైతాంగం ఎదురుచూస్తున్నదని తెలిపారు.