Harish Rao | ఆరోగ్యశ్రీ బకాయిలు, సిబ్బందికి జీతాలు చెల్లించడంలో వైఫల్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు మండిపడ్డారు. ఆరోగ్యశ్రీపై ఎందుకంత కక్ష అని సీఎం రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు.
ఆరోగ్యశ్రీ సిబ్బంది ఆవేదన వింటే గుండె కలిచి వేస్తోందని హరీశ్‌రావు అన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ, ఎన్నో కుటుంబాలకు అండగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయడం లేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల నిధులు విడుదల కాకపోవడంతో ఆరోగ్యశ్రీ విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి 18 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని చెప్పారు.
నెలల తరబడి జీతాలు లేకుండా సిబ్బంది ఎలా బతకాలి? వారి కుటుంబాల పరిస్థితి ఏమిటి? పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దెలు, కుటుంబ ఖర్చులు ఎలా భరించాలి అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ప్రతి నెల 1వ తేదీకే వేతనాలు చెల్లిస్తాం అని హామీ ఇచ్చారు. మరి మీ సమాధానం ఏంటని నిలదీశారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రులకీ 2023 నవంబర్ నుంచి ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ నిధులు ఒక రూపాయి కూడా ఎందుకు విడుదల కాలేదని తెలిపారు. దాదాపు 24 కోట్లు ఆరోగ్యశ్రీ నిధులు పెండింగ్ లో ఉందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆస్పత్రిలో కూడా ఇదే పరిస్థితి ఉందన్నారు.
నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఆసుపత్రుల నిర్వహణ, రోగుల సంరక్షణ, మందులు, వైద్య పరికరాలపై ప్రభావం పడ్డది, సేవలు అందడంలేదని హరీశ్‌రావు తెలిపారు. ఇదే సమయంలో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా నెలల తరబడి బిల్లులు పెండింగ్‌లో పెట్టారని అన్నారు. ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకపోతే వైద్యులు, నర్సింగ్ సిబ్బంది జీతాలు, మందులు, పరికరాల కొనుగోళ్లు, ఆసుపత్రి నిర్వహణపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందన్నారు. ఆరోగ్యశ్రీ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని గొప్పగా ప్రకటించారు. కానీ అది ప్రకటనలకే పరిమితమయ్యిందని పేర్కొన్నారు.
ఆరోగ్యశ్రీ కవరేజీ పెంచామని చెప్పుకుంటున్న ప్రభుత్వం.. మరోవైపు రోజురోజుకూ ఆరోగ్యశ్రీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని హరీశ్‌రావు విమర్శించారు. బకాయిలు పేరుకుపోతూ, ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించడమే ఆసుపత్రులకు భారంగా మారితే.. చివరకు నష్టపోయేది ఎవరు? పేద రోగులే కదా అని ప్రశ్నించారు. పేద ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న ఆరోగ్యశ్రీకి నిధుల కొరత ఎందుకు వచ్చిందని అడిగారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల మధ్య ఎలాంటి తేడా చూపకుండా, సీనియారిటీ, ఫస్ట్ కమ్–ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన ఆరోగ్యశ్రీ నిధులను విడుదల చేయాలన్నారు.
ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించిన ఆసుపత్రులకు పెండింగ్‌లో ఉన్న రూ.1,400 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, 18 నెలలుగా పెండింగ్‌లో ఉన్న సిబ్బంది జతాలు తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసే కుట్రలు ఆపాలని.. పేదల ప్రాణాధారమైన ఆరోగ్యశ్రీని కాపాడాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కోరారు..