Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. ప్రభుత్వం మెడలు వంచి బాధితులకు న్యాయం చేసే బాధ్యత తమపై ఉందని తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సెక్షన్ 22ఏను తొలగింపజేస్తామని స్పష్టం చేశారు. మా పోరాటం ప్రజల కోసం.. రాజకీయాల కోసం కాదు అని అన్నారు. భేషరతుగా సెక్షన్ 22ఏ జాబితాలోని భూములన్నీ తొలగించకుంటే సెక్రటేరియట్ ముట్టడిస్తామని హెచ్చరించారు.
కూకట్‌పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో సెక్షన్ 22ఏ బాధితుల సమావేశం జరిగింది. కేపీహెచ్‌బీ ఎస్‌ఆర్‌ఎస్‌ఏ కమ్యూనిటీ హాలులో జరిగిన ఈ సమావేశంలో బాధితులతో హరీశ్‌రావు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఏ ఉద్దేశంతో సెక్షన్ 22ఏ తీసుకొచ్చిందని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో ప్రజలు కేంద్రంగా పరిపాలన కొనసాగిందని తెలిపారు. అదే రేవంత్ పాలనలో భూములు కేంద్రంగా పరిపాలన కొనసాగుతోందని విమర్శించారు. ప్రజలకు ఏం కావాలో ఆలోచించిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు.
రాష్ట్రంలో ప్రతి ఇంటికీ తాగునీరు, 24 గంటల కరెంటు అందించారని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలని కేసీఆర్ తపన పడ్డారని చెప్పారు. కేసీఆర్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచారని అన్నారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చారని తెలిపారు. దేశానికే తెలంగాణను అన్నపూర్ణగా మార్చారని పేర్కొన్నారు. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్, హరియాణాలను తలదన్ని, దేశంలోనే అగ్రగామిగా నిలిపారని గుర్తుచేశారు.
పైసా పైసా కూడబెట్టి ఇల్లు కట్టుకుంటే కాజేస్తారా అని హరీశ్‌రావు ప్రశ్నించారు.రాత్రికి రాత్రి భూములన్నీ నిషేధిత జాబితాలో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు గుండెమీద చెయ్యేసుకుని ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడు హైడ్రా వస్తదో.. ఎప్పుడు సెక్షన్ 22ఏ వస్తదో అని భయంలో బతుకుతున్నారని తెలిపారు.
కేసీఆర్ పాలనలో హైదరాబాద్‌లో అద్భుతమైన అభివృద్ధి జరిగిందని హరీశ్‌రావు కొనియాడారు. యావత్ దేశం హైదరాబాద్ వైపు చూసేలా కేసీఆర్ చేశారని అన్నారు. రేవంత్ రెడ్డి వచ్చాక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మంటగలిసిపోయిందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డివి తుగ్లక్ నిర్ణయాలు అని విమర్శించారు. అవసరం పడి అమ్ముకుందామంటే ఎవరైనా కొనే పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. అమెరికాలో ఉన్న మనవాళ్లు ఇక్కడ ఇండ్లు కొనడం ఆపేశారని తెలిపారు. పైసలుంటే అమెరికాలోనే పెట్టుబడులు పెట్టుకుంటున్నారని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా కోటి ఎకరాలను సెక్షన్ 22ఏ జాబితాలో చేర్చారని హరీశ్‌రావు తెలిపారు. ఒక్క హైదరాబాద్‌లోనే లక్షలాది ఆస్తులను ఈ జాబితాలో పెట్టారని పేర్కొన్నారు. కాలనీలకు కాలనీలు 22ఏ జాబితాలోకి వెళ్లాయని అన్నారు. 98 శాతం భూములను తీసేశామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అబద్దాలు చెబుతున్నాడని అన్నారు. సెక్షన్ 22 ఏ కారణంగా చాలామందికి లోన్లు రాలేదని తెలిపారు. ప్రభుత్వం తప్పు చేస్తే.. ప్రజలు ఎందుకు బాధపడాలని ప్రశ్నించారు. సెక్షన్ 22ఏ పెట్టింది మీరే.. తీసేయాల్సింది కూడా మీరే అని స్పష్టం చేశారు. ప్రజలు ఎందుకు దరఖాస్తులు పెట్టుకుని కార్యాలయాల చుట్టూ తిరగాలని నిలదీశారు. మీ తప్పునకు ప్రజలు ఎందుకు శిక్ష అనుభవించాలని ప్రశ్నించారు. ప్రజలు ఎందుకు దరఖాస్తులు పట్టుకుని కార్యాలయాల చుట్టూ తిరగాలని ప్రశ్నించారు. మీరే చేసిన తప్పునకు ప్రజలు ఎందుకు శిక్ష అనుభవించాలని అడిగారు. తప్పు చేసింది మీరు.. సరిదిద్దుకోవాల్సింది కూడా మీరేనని పునరుద్ఘాటించారు.
ప్రజల నుంచి 30 శాతం కమీషన్లు గుంజుతున్నారని హరీశ్‌రావు విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి బ్రోకర్లు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏజెంట్లు కాలనీల్లో తిరుగుతున్నారని తెలిపారు. ప్రజలు ఒక్క రూపాయి కూడా బ్రోకర్లకు ఇవ్వద్దని సూచించారు. మీ ఆస్తులను కాపాడి మీకు అప్పగించే బాధ్యత మాది అని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి అసెంబ్లీ మొదలవుతుందని తెలిపారు. అసెంబ్లీలో సెక్షన్ 22ఏపై పోరాడతామని పేర్కొన్నారు.
కబ్జాదారులే ధర్నాలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడని హరీశ్‌రావు తెలిపారు. రేవంత్ పాలనలో ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం మెడలు వంచి మీకు న్యాయం చేసే బాధ్యత మాపై ఉందని చెప్పారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సెక్షన్ 22ఏను తొలగింపజేస్తామని స్పష్టం చేశారు. మా పోరాటం ప్రజల కోసం.. రాజకీయాల కోసం కాదు అని అన్నారు. భేషరతుగా సెక్షన్ 22ఏ జాబితాలోని భూములన్నీ తొలగించకుంటే సెక్రటేరియట్ ముట్టడిస్తామని హెచ్చరించారు.