సంగారెడ్డి, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): రియల్ ఎస్టేట్ వ్యాపారులు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేతిలో రాష్ట్రం ఆగమవుతున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. 22ఏ నిషేధిత జాబితాలో పేదలు, రైతుల భూములను చేర్చి వారి ఉసురుపోసుకుంటున్నారని నిప్పులుచెరిగారు. ఎలాంటి దరఖాస్తులు ఇవ్వకుండానే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి నివాస గృహాలను 22ఏ జాబితా నుంచి రాత్రికి రాత్రి తొలగించిన ప్రభుత్వం.. రాష్ట్రంలోని సామాన్యులు, రైతులు భూములు, ఆస్తులను కూడా వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేకపోతే బాధితులతో కలిసి బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని హరీశ్‌రావు హెచ్చరించారు.
శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని జీఎంఆర్ ఫంక్షన్హాల్లో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో పటాన్చెరు నియోజకవర్గంలోని 22ఏ జాబితా బాధితులతో కలిసి నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిషేధ జాబితాలో భూములను చేర్చి డబ్బులు దండుకునేందుకే రేవంత్‌రెడ్డి, పొంగులేటి స్కెచ్ వేశారని ఆరోపించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి కాదని.. పొంగులూటీ అంటూ ఎద్దేవా చేశారు. పొంగులేటి దురాశ.. భవిష్యత్తులో ఆయన దుఃఖానికి కారణం అవుతుందని హెచ్చరించారు. 22ఏ జాబితాలో అధికారుల తప్పు ఉన్నదని చెబుతున్న ప్రభుత్వం.. వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటిరెడ్డి నాలుగు నెలల క్రితమే నల్లగొండ జిల్లాలో 40వేల ఎకరాలకు పైగా భూములను నిషేధిత జాబితాలో చేర్చారని, వెంటనే తొలగించాలని సీఎం దృష్టికి తీసుకెళ్లినా ప్రభుత్వం పట్టించుకోలేదని నిలదీశారు.
రాష్ట్రంలోని వేలాది ఎకరాల భూములు, నివాసగృహాలను 22ఏ జాబితాలో చేర్చి సామాన్యులు, రైతుల ఉసురుతీస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. జాబితాలో 98శాతం భూ సమస్యలను పరిష్కరించామని పొంగులేటి బొంకుతున్నారని, అలా అయితే ఒక్క పటాన్చెరు నియోజకవర్గంలోనే 53వేల ఎకరాలు, లక్షల ఇండ్లు జాబితాలో ఎలా ఉంటాయని ఆయన ప్రశ్నించారు.

పొంగులేటి తప్పుచేస్తే ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారని మండిపడ్డారు. 22ఏ దందాలో పొంగులేటి హస్తం లేకపోతే రేవంత్‌రెడ్డి వెంటనే ఆయనను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పటాన్చెరు నియోజకవర్గంలోని 50,560 ఎకరాలను వారంలోగా జాబితా నుంచి తొలగించాలని, లేకపోతే సంగారెడ్డి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
ప్రజావ్యతిరేక పనుల చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి పాలమూరు జిల్లా పరువు తీస్తున్నారని 22ఏ బాధితుడు శ్రీనివాస్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 22ఏ బాధితులతో హరీశ్‌రావు ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అమీన్‌పూర్‌లోని కేఎస్ఆర్కాలనీవాసి శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ.. తన ఇంటితోపాటు తన కాలనీలోని వందలాది ఇండ్లను జాబితాలో చేర్చారని, ఈ కారణంగా తన మిత్రుడు శ్యామ్ కుమార్తె పెండ్లి ఆగిపోయిందని ఆవేదనతో చెప్పాడు. తాను పాలమూరు జిల్లావాసినే అని, అదే జిల్లాకు చెందిన సీఎం రేవంత్‌రెడ్డి.. జిల్లా పరువుతీస్తున్నారని మండిపడ్డారు. అలాగే చిట్కుల్ గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ శ్రావణ్ మాట్లాడుతూ చిట్కుల్లో దివంగత మాజీ సీఎం అంజయ్య హయాంలో 1980లో చిట్కుల్లో చేసిన లేఔట్లను 22ఏ జాబితాలో చేర్చారని తెలిపారు.
చిట్కుల్లోని ఆరు కాలనీల్లో 22ఏ జాబితాలో చేర్చడంతో ఇండ్ల క్రయవిక్రయాలు నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్నట్టు చెప్పారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా జాబ్ చేయాలో 22ఏ జాబితా నుంచి తమ ఇండ్లను తొలగించాలని అధికారుల చుట్టూ తిరుగాలో అర్థంకావడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. జాబితా నుంచి తన 284 గజాల స్థలాన్ని తొలగించేందుకు రెవెన్యూ అధికారులు రూ.2 కోట్లు డిమాండ్ చేశారని 22ఏ బాధితుడు మధుసూదన్ కుమార్ వాపోయాడు. కోర్టు ఆదేశించినా పట్టించుకోకుండా తమ ఆస్తులను 22ఏ జాబితాలో చేర్చారంటూ కాంగ్రెస్ సర్కార్‌పై మండిపడ్డారు. ఆందోళన వద్దని, బీఆర్ఎస్ అండగా ఉంటుందని హరీశ్‌రావు వారికి భరోసా ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పటాన్చెరులో 22ఏ జాబితాలో చేర్చిన భూములు, ఇండ్ల వివరాలను హరీశ్‌రావుకు అందజేశారు. కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్, నియోజకవర్గ కో-ఆర్డినేటర్ ఆదర్శ్‌రెడ్డి, నాయకులు గూడెం మధుసూదన్‌రెడ్డి, మెట్టుకుమార్ యాదవ్, కొలను బాల్‌రెడ్డి, గోవర్దన్‌రెడ్డి, పాండురంగారెడ్డి, సోమిరెడ్డి, యాదగిరి యాదవ్, శ్రీశైలం యాదవ్ , శ్రీకాంత్ గౌడ్, విజయ్ పాల్గొన్నారు.