కరీంనగర్, జూన్ 16(నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీఎం రేవంత్‌రెడ్డికి రైతులపై ప్రే ముంటే మూడుసార్లు ఎగ్గొట్టిన బాకీ పడ్డ రైతుబంధు రూ.19వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. రైతుబీమా గడువు ముగిసి నాలుగు నెలలు గడుస్తున్నా ఎల్ఐసీకి డబ్బులు ఎందుకు చెల్లించలేదో సీఎం సమాధానం చెప్పి తీరాలని నిలదీశారు. మంత్రులకు తెలియకుండానే.. వారి శాఖల్లో కుంభకోణాలు జరుగుతున్నాయని, అవి తెలుసుకోకుండా వాళ్లు మాట్లాడుతుంటే జాలేస్తున్నదని దెప్పిపొడిచారు. అన్ని వర్గాలు ముఖ్యంగా రైతులను అన్ని రకాలుగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ నాయకులు కూడా ఓటు వేసే పరిస్థితి లేదని ధ్వజమెత్తారు.
కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూరులో మంగళవారం మానకొండూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ విసృత స్థాయి సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అధ్యక్షత వహించగా, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, పేరాల రవీందర్‌రావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలు, అన్ని వర్గాలకు జరిగిన మోసాలను వివరిస్తూనే.. తిరిగి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహాలపై హరీశ్‌రావు దిశానిర్దేశం చేశారు.
కేసీఆర్ తెచ్చిన రైతుబీమా పథకానికి రేవంత్‌రెడ్డి సర్కార్ తూట్లు పొడుతుస్తున్నదని హరీశ్‌రావు విమర్శించారు. గడువు దాటి నాలుగు నెలలవుతున్నా రైతు బీమా కింద ఎల్ఐసీకి డ బ్బులను రేవంత్‌రెడ్డి కట్టకపోవడమే అందుకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తంచేశారు. బోనస్ బోగస్ అయిందని, నిరుడు యాసంగిలో రూ.1,100 కోట్లు, ఈ సీజన్లో రూ.వెయి కోట్ల బోనస్ ఇవ్వకుండా సర్కార్ ఎగబెట్టిందని మండిపడ్డారు. రైతుబంధు, బీమా ఎరువులు, సబ్సిడీలు ఇవ్వకుండా అన్నదాతలను అరిగోస పెడుతున్న రేవంత్‌రెడ్డికి ఎవరైనా ఓటేస్తారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా రైతుబంధు ఆపలేదని, ఆనాడు కరెంటు, ఎరువు లు, నీటికి ఎలాంటి కొరత లేదని గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్ వచ్చిన తర్వాత మళ్లీ మొదటికి వచ్చిందని, ఎరువుల కోసం క్యూకట్టాల్సి వస్తున్నదని మండిపడ్డారు.
విద్యార్థులకు పెట్టే ఉప్పు, పప్పు, కోడిగుడ్ల టెండర్లలో రూ.2వేల కోట్ల స్కామ్ జరిగిందని తాను మీడియాకు చెబితే.. మంత్రులు పొన్నం ప్రభాకర్, లక్ష్మణ్‌కుమార్‌లు శాఖలపై అవగాహన లేకుండా చాలెంజ్ చేయడం చూస్తే జాలేస్తున్నదని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ‘మేం కొన్నదే రూ.680 కోట్లది అయితే రూ.2వేల స్కామ్ ఎలా? అంటూ వాళ్ల శాఖలో ఏం జరుగుతుందో తెలియకుండా మాట్లాడుతున్నరు’ అని విమర్శించారు. బట్టలు, బూట్లు, షూలు, టైల కోసం రూ.1,200 కోట్లు, ఉప్పు, పప్పు, మటన్ చికెన్ కోడిగుడ్ల కోసం రూ.800కోట్లతో టెండర్లు పిలిచారని, ఆ రెండు కలిపితే రూ. 2వేలు కోట్లు కావా? అని ప్రశ్నించారు. రూ. 2వేల కోట్లతో టెండర్లు పిలిచిన విషయం ఈ మంత్రులకే తెలియపోతే.. వీళ్లు ఏం పాలన చేస్తున్నారో అర్థంకావడం లేదని పేర్కొన్నారు.
రేవంత్‌రెడ్డి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామంటున్నారని, నిజానికి మహిళలు కాలేదని, ఎనుముల నలుగురు అన్నదమ్ములు మాత్రం కోటీశ్వర్లు అయ్యారని హరీశ్‌రావు విమర్శించారు. ఎనుముల కుటుంబం కడుపు నిండిందని, మహిళలు, పేదలు, రైతుల కడుపు ఎండుతున్నదని దుయ్యబట్టారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఉపాధిహామీ కూలీలకు 12వేలు ఇస్తామని మూడు బడ్జెట్లలో చెప్పి ఒక్క పైసా ఇవ్వలేదని మండిపడ్డారు.
ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా రూ. 30 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌తో రేవంత్‌రెడ్డి చెలగాటం ఆడుతున్నారని హరీశ్‌రావు ఆగ్రహించారు. ఫీజులు రాకపోవడంతో యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వమని చెబుతున్నాయని తెలిపారు. తమ తప్పులను కప్పిపుచ్చుకొనేందుకు బీఆర్ఎస్పై అబద్ధాలు ప్రచారం చే స్తున్నదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రూ.19,500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించామని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. పిల్లలు చదువులకు దూరం అయితే ఒక తరమే వెనుకపడిపోతుందని ఆవేదన వ్యక్తంచేశారు. పోలీస్ శాఖలో 19వేల ఖాళీలున్నాయని ఇటీవల డీజీపీ సీవీ ఆనంద్ చెబితే సీఎం మాత్రం 5వేల కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామంటున్నారని, ఖాళీలున్నా.. నోటిఫికేషన్లు ఇవ్వకపోవడమేమిటని ఆగ్రహించారు. రేవంత్ పని అయిపోయిందని, అందుకే అధికారులు ఆయన మాట వినడం లేదని తెలిపారు.
పంట బోనస్ నుంచి తప్పించుకొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నరకాల సంఖ్యను తగ్గించడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఏ రకం ధాన్యం వేయాలని సరారు నిర్ణయించడం అంటే అన్నదాతల మెడపై ప్రభుత్వం కత్తి పెట్టడమేనని ఒక ప్రకటనలో మండిపడ్డారు. అన్ని పంటలకు రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రకటించి, ఆ తర్వాత 33రకాల సన్నాలకు పరిమితం చేశారని, ఇప్పుడు వాటిని కూడా ఏడుకు తగ్గించారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రభుత్వం చెప్పిన ఏడు రకాలకే బోనస్ ఇస్తామంటే, ఇప్పటికే నారు పోసిన రైతుల పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు. బోనస్‌కు కోతలు, రైతన్నలకు వాతలు పెట్టేందుకే సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం వ్యవసాయశాఖపై సమీక్ష నిర్వహించారా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా మొకుబడి సమీక్షలు చేయడం ఆపేసి, రైతు సంక్షేమంపై దృష్టిపెట్టాలని హితవుపలికారు. ఏడు రకాల సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామన్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.