Harish Rao | కాళేశ్వరం దగ్గర చిల్లర రాజకీయం చేశావని సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు మండిపడ్డారు. మరి దేవాదుల దగ్గర నీకు ఏం అడ్డమొచ్చిందని ప్రశ్నించారు. దేవాదుల విషయంలో నాటి నుంచి నేటి దాకా కాంగ్రెస్ పార్టీది ద్రోహమే అని మండిపడ్డారు. 2011లో మూడేళ్లు దేవాదులను మూలకు పడేసిందే కాంగ్రెస్ పార్టీ అని గుర్తుచేశారు. ఎల్‌నినో పేరు చెప్పి ఎగనామం పెడితే బీఆర్ఎస్ ఊరుకోదని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి బొట్టును ఒడిసి పట్టాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డికి ఉందని అన్నారు. మాట్లాడితే తిట్లు, ఒట్లు తప్ప ఏమీ లేదని మండిపడ్డారు. మొన్న రాములోరి మీద కూడా ఒట్టు పెట్టిండు అని తెలిపారు. ఒట్ల మీద ఉన్న శ్రద్ధ.. నీటి బొట్ల మీద పెట్టాలని హితవుపలికారు. లేదంటే చరిత్రహీనుడిగా మిగిలిపోవడం ఖాయమని హెచ్చరించారు.
నీళ్లు రాకున్నా.. కరెంటు లేకున్నా రేవంత్ రెడ్డిదే బాధ్యత అని హరీశ్‌రావు స్పష్టం చేశారు. జూన్ 1 నుంచి నేటి వరకు సమ్మక్క బ్యారేజీ నుంచి 105 టీఎంసీల నీరు కిందకు పోయిందని తెలిపారు. నీళ్లన్నీ ఆంధ్రాకు తరలిపోయాయని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం 1.9 టీఎంసీలు మాత్రమే ఎత్తిందని చెప్పారు. నాలుగు రోజులకు ఒక టీఎంసీ ఎత్తవచ్చని.. 50 రోజులకు 12 టీఎంసీలు ఎత్తే అవకాశం ఉందని తెలిపారు. కానీ కనీసం రెండు టీఎంసీలు కూడా ఎత్తలేదని విమర్శించారు. ఇది నేరపూరిత నిర్లక్ష్యం కాదా అని ప్రశ్నించారు. నీ ప్రభుత్వానికి ఏం శిక్ష వేయాలో నువ్వే చెప్పు అని సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు. ఇన్ని నీళ్లు ఉంటే ఎత్తవా అని మండిపడ్డారు. ఇదేనా రైతులపై నీకు ఉన్న చిత్తశుద్ధి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న దేవాదులను నిర్వహించే సత్తా మీకు లేదా అని అడిగారు. మీ వైఫల్యం వల్ల వరంగల్ జిల్లా వ్యవసాయ సంక్షోభంలో మునిగిపోయిందని అన్నారు. వరంగల్, కరీంనగర్ జిల్లాలు ఆగమయ్యే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ సర్కార్ వైఫల్యమే అని ఆరోపించారు.
22 రిజర్వాయర్ల కెపాసిటీ 12 టీఎంసీలు అని.. ప్రతిరోజు పావు టీఎంసీ ఎత్తవచ్చని తెలిపారు. అంటే ఇప్పటికి 12 టీఎంసీలు ఎత్తిపోయవచ్చని పేర్కొన్నారు. మరెందుకు 22 రిజర్వాయర్లు నింపలేదని ప్రశ్నించారు. దేవాదుల నుంచి 105 టీఎంసీలు కిందకు తరలిపోయాయని తెలిపారు. ఈ రోజు కూడా దేవాదులలో 78 మీటర్ల ఎత్తులో నది ప్రవహిస్తున్నదని పేర్కొన్నారు. 73 మీటర్లు ఉంటే చాలు మోటార్లు నడుస్తాయని.. 78 మీటర్లు ఉన్నప్పటికీ మోటార్లు నడిపించడం లేదని చెప్పారు. ఎందుకు నీళ్లు ఎత్తిపోయడం లేదని, ఏమిటీ నిర్లక్ష్యమని ప్రశ్నించారు.
అతి తక్కువ వర్షపాతం పడిన జిల్లా వరంగల్ జిల్లా అని హరీశ్‌రావు తెలిపారు. రెయిన్‌ఫాల్ తక్కువ ఉంటే సమ్మక్క బ్యారేజీ నుంచి నీళ్లు ఎత్తడం లేదని పేర్కొన్నారు. ఎందుకు నీళ్లను కిందకు జారవిడుస్తున్నారని ప్రశ్నించారు. మేం ప్రెస్‌మీట్ పెట్టగానే.. దేవాదులలో రెండు మోటార్లు స్టార్ట్ చేశారని తెలిపారు. మేం ప్రశ్నిస్తే తప్ప నీళ్లు ఎత్తిపోయారా అని నిలదీశారు. ప్రధాన ప్రతిపక్షంగా రైతుల పక్సాన బాధ్యతాయుత పోరాటం చేస్తున్నామని మండిపడ్డారు.