రాహుల్‌గాంధీ అదానీ వద్దు అంటే రేవంత్‌రెడ్డి అదానీ కావాలని అంటున్నరు. అసలు ఇక్కడ ఉన్నది రాహుల్ కాంగ్రెస్సా? రేవంత్ కాంగ్రెస్సా? వక్రబుద్ధి ఉంటే అన్నీ వంకరగానే కనిపిస్తయ్. ఓటుకునోటు కేసులో రేవంత్‌కు బెయిల్ బీజేపీ ఇస్తేనే వచ్చిందా? రేవంత్‌కు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ఇప్పటికైనా వైఖరి మార్చుకోవాలె
– హరీశ్‌రావు
Harish Rao | హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): ‘రూ.50 లక్షలు ఇస్తూ దొరికిన దొంగ రేవంత్‌రెడ్డి. రైతులను మోసం చేసిన గజదొంగ. దేవుళ్లు, రైతులను మోసం చేసిన చరిత్ర. బ్లాక్మెయిలర్లకు బాడాబాబువు. రూ.50 లక్షలతో పట్టుబడ్డ దొంగవు.. నువ్వు నన్ను దొంగ అంటవా?’ అని సీఎం రేవంత్‌పై మాజీమంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఏ గ్రామంలోనైనా 100 శాతం రుణమాఫీ అయ్యిందా చూపించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని ప్రశ్నించారు. రాహుల్ రాష్ర్టానికి వస్తే తానే స్వాగతం పలుకుతానని, సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లి అయినా, మరే గ్రామంలోనైనా పర్యటిద్దామని.. 100 శాతం రుణమాఫీ అయినట్టు చూపించాలని సవాల్ విసిరారు. గురువారం తెలంగాణభవన్‌లో మీడియాతో ఇష్టాగోష్టిలో మాట్లాడిన హరీశ్‌రావు.. రుణమాఫీ విషయంలో రాహుల్‌గాంధీని కూడా రేవంత్ తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. దొంగే దొంగ దొంగా అన్నట్టుగా రేవంత్ వ్యవహారం ఉన్నదని విమర్శించారు. మాఫీ విషయంలో మంత్రులు ఒకలా, సీఎం మరోలా.. పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. రుణమాఫీ అంశంపై రేవంత్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని.. డిసెంబర్ 9 అని, మార్చి అని, ఆ తర్వాత ఆగస్టు 15 అని చెప్పి ఎందుకు ఇంకా మాఫీ చేయలేకపోయారని నిలదీశారు.
రుణమాఫీ విషయంలో ప్రజలనే కాదు రాహుల్‌గాంధీని కూడా రేవంత్‌రెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. వరంగల్ సభకు రాహుల్‌ను రేవంత్ మూడు సార్లు పిలిచినా ఆయన రావటం లేదని తెలిపారు. రాహుల్‌గాంధీ ఎప్పుడు హైదరాబాద్ వస్తారో చెప్తే, తాను ఎయిర్‌పోర్టుకు వెళ్లి ఆయనకు స్వాగతం పలికి సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లికి తీసుకెళ్తానని, రుణమాఫీ అయ్యిందో లేదో తేలుతుందని స్పష్టంచేశారు. రుణమాఫీ పూర్తయితే గ్రీవెన్స్ అవసరం ఎందుకు? అని నిలదీశారు. మాఫీపై తాము నివేదిక ఇస్తే సీఎం పదవిలో ఆయనెందుకు? అని ఎద్దేవా చేశారు.
ప్రజల కోసం పోరాడే బాధ్యతను ప్రజలు బీఆర్ఎస్కు ఇచ్చారని, ఆ బాధ్యతను నిర్వర్తిస్తామని తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితి అని వెల్లడించారు. గతంలో ఓ మీడియా చిట్‌చాట్‌లో విద్యుత్తు బకాయిలను అదానీకి అప్పగిస్తామని రేవంత్ చెప్పారని, ఇదే విషయాన్ని తాము అసెంబ్లీలో అడిగితే తామెక్కడ అన్నామని బుకాయించారని గుర్తుచేశారు. అసలు రేవంత్ మీడియాతో మాట్లాడేది చిట్‌చాట్ కాదని, చీట్‌చాట్ అని విమర్శించారు.
సీఎంగా ఉండి సుప్రీం తీర్పును తప్పుబట్టడమా? సీఎం స్థాయిలో ఉండి సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టడం నేరమని రేవంత్‌పై హరీశ్ ధ్వజమెత్తారు. సిసోడియాకు బెయిల్ వస్తే బీజేపీతో పోరాటం, కవితకు బెయిల్ వస్తే బీజేపీతో లాలూచీనా? అని సీఎంను ప్రశ్నించారు. సిసోడియాకు బెయిల్ వస్తే ఏఐసీసీ సానుకూలంగా స్పందించిందని, అదే కేసులో కవితకు బెయిల్ వస్తే రాష్ట్ర కాంగ్రెస్ విరుద్ధంగా స్పందిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న కే కేశవరావు కూడా కవిత బెయిల్ విషయంలో సానుకూలంగా స్పందించారని, రేవంత్ మాత్రం వక్రభాష్యం చెప్తున్నారని అన్నారు. బెయిల్‌పై రేవంత్, బండి సంజయ్ వ్యాఖ్యలు ఒకే తీరుగా ఉన్నాయని మండిపడ్డారు. కవిత బెయిల్ విషయంలో న్యాయం, ధర్మం గెలిచిందని.. ఈడీ, సీబీఐపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందని గుర్తుచేశారు.
రుణమాఫీ చేస్తామని మోసం చేశామని రేవంత్ అంటున్నరు.. రుణమాఫీ జరగనేలేదని మంత్రులు, ఎమ్మెల్యేలు అంటున్నరు.. ఓ ఎమ్మెల్యే అయితే ఏకంగా అధికారులపై పేపర్లు విసిరేశారు.. రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతున్నదని తుమ్మల చెప్తున్నరు.. మరో 20 లక్షల మందికి రుణమాఫీ చేయాలని ఉత్తమ్ అన్నారు.. ఇంకా రుణమాఫీ చేయాల్సి ఉన్నదని పొంగులేటి చెప్తున్నరు.. రైతు రుణమాఫీపై కాంగ్రెస్ నేతలే తలా ఒక రకంగా మాటలు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కూల్చివేతల సరార్ హైదరాబాద్ బ్రాండ్‌ను,
రైతుబంధును కూల్చివేశారు వైద్య వ్యవస్థను, కేసీఆర్ కిట్‌ను కూల్చేశారు పార్టీ ఫిరాయింపులతో ప్రజాస్వామ్యాన్ని కూల్చేశారు దేవుళ్లపై ఒట్టు వేసి ప్రజల విశ్వాసాలను కూల్చేశారు గొర్రెల పంపిణీ చేయకుండా గొర్రెల కాపర్ల ఉపాధిని కూల్చేశారు చేపపిల్లల పంపిణీ చేయకుండా మత్స్యకారుల ఉపాధిని కూల్చారు
– హరీశ్‌రావు
తెలంగాణ తల్లి విగ్రహానికి సీఎం రేవంత్ శంకుస్థాపన చేస్తే మంత్రులు ఎవరు రాలేదని హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ తల్లికి రూపం ఇచ్చిందే కేసీఆర్ అని చెప్పారు. తెలంగాణ తల్లి భావనకు రూపం ఇచ్చింది కేసీఆరేనని, తెలంగాణ లేకుండా తెలంగాణ తల్లి రూపం ఎక్కడదని, తెలంగాణను తీసుకవచ్చిందే కేసీఆర్ అని స్పష్టం చేశారు. కేసీఆర్ ఆనవాళ్లపై రేవంత్‌రెడ్డి నిలబడ్డారని గుర్తుచేశారు.
వాల్మీకి సాం పట్టపగలు నిలువు దోపిడీ అని హరీశ్ రావు ఆరోపించారు. వాల్మీకి స్కాంతో డబ్బు, కార్లు, బంగారం, మద్యం షాపులకు నేరుగా వెళ్లాయని అన్నారు. తెలంగాణకు చెందిన 9 కంపెనీల అకౌంట్స్‌కు కర్ణాటక వాల్మీకి ప్రభుత్వ సంస్థ నుంచి డబ్బులు బదిలీ అయ్యాయని, వాల్మీకి సాంపై కాంగ్రెస్ నేతలు ఎందుకు నోరు మెదపటం లేదని ప్రశ్నించారు. ఈ డబ్బు ఎవరికి వచ్చిందో విచారణకు సిద్ధమా? అని సీఎం రేవంత్‌కు సవాల్ విసిరారు. ఈ స్కాంపై తెలంగాణ బీజేపీ ఎందుకు స్పందించటం లేదని ఎండగట్టారు. రాష్ట్రంలో ఆ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని, స్కాంపై తెలంగాణలో ఈడీ విచారణ ఎందుకు జరగటం లేదని అనుమానం వ్యక్తం చేశారు. రాహుల్‌గాంధీ, కేంద్రమంతులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. వాల్మీకి సాంపై విచారణ చేయాలని బీఆర్ఎస్ తరఫున ఈడీని కలుస్తామని తెలిపారు. రాష్ట్రంలో పౌరసరఫరాల సంస్థపైనా ఈడీ విచారణ జరపాలని, ఎఫ్‌సీఐ కేంద్రం సంస్థ అయినందున దీనిపై కూడా ఈడీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ ఫోర్త్ సిటీ పేరుతో ప్రభుత్వ భూములు కొల్లగొట్టే కుట్ర జరుగుతున్నదని హరీశ్‌రావు ఆరోపించారు. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలను ఆధారాలతో సహా బయటపెడతామని ప్రకటించారు. కందుకూరులో సర్వే నంబర్ 9లో 385 ఎకరాల ప్రభుత్వభూమిని కొల్లగొడుతున్నారని, తుకుగూడలో సర్వే నంబర్ 892/1లో 25 ఎకరాలు పేద రైతుల దగ్గర బినామీల పేరుతో తీసుకుంటున్నారని ఆరోపించారు. ముచ్చర్లలో ప్రభుత్వంలో పెద్దలుగా చలామణీ అవుతున్న తమ్ముళ్ల పీఏల పేరు మీద భూములు కొంటున్నారని వెల్లడించారు. వీటన్నింటికీ తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ తగ్గిందని, రేవంత్‌రెడ్డి దగ్గర ఉండి డీకే అరుణను గెలిపించారని, మోదీతో మాట్లాడుకొని వచ్చి తెలంగాణలో బీజేపీ ఎంపీలను రేవంత్‌రెడ్డి గెలిపించారని ఆరోపించారు. ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
చారిటీ స్టార్ట్ ఫ్రమ్ హోం అనేది సామెత ఉన్నదని, దానిలోభాగంగా ముందుగా హైడ్రా ఆఫీసును కూల్చాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. హైడ్రా ఆఫీసు బుద్ధభవన్ నాలా కింద ఉన్నదని, దాన్నీ కూలగొడతారా? రంగనాథ్ ముందుగా తన ఆఫీసును కూలగొట్టుకొని ఇతరులకు ఆదర్శంగా నిలవాలని అని సూచించారు. జీహెచ్ఎంసీ ఆఫీసు నాలా కింద ఉన్నదని, నెక్లెస్‌రోడ్‌లో కమర్షియల్ షాపులు, ఇతర వాణిజ్య భవనాలను కూలగొడతారా? లుంబినీ పార్కు కూడా హుస్సేన్‌సాగర్‌లోనే ఉన్నది.. బోట్స్ క్లబ్, సెయిలింగ్ క్లబ్ ఇలా ఎన్నో హుస్సేన్‌సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నాయి.. వాటినీ కూల్చాలని హరీశ్ డిమాండ్ చేశారు. మీరాలం చెరువు, ఉప్పల్, రామాంతపూర్ చెరువుల్లో పెద్దపెద్ద టవర్లు వచ్చాయని, వాటిని కూలగొట్టి వారికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను సస్పెండ్ చేయాలంటున్న సీఎం.. అందరికీ ఒకటే రూల్ ఉండాలని, కాంగ్రెస్‌లో ఉన్న పట్నం మహేందర్‌రెడ్డి, గుత్తా అమిత్‌రెడ్డిని కూడా సస్పెండ్ చేయాలని సవాల్ విసిరారు. మంత్రి పొంగులేటి ఇంట్లో డ్రైనేజీ నీళ్లు చెరువులోకి వెళ్లడం లేదా? పొంగులేటి ఇంటికి ఏమైనా స్పెషల్‌గా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉన్నదా? అంటూ నిలదీశారు. డ్రైనేజీ నీళ్లు చెరువుల్లోకి పోతున్నాయంటున్న సీఎం.. పరోక్షంగా పొంగులేటిని తిడుతున్నారని అన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కాలేజీని గతంలో కూల్చివేశారని గుర్తుచేశారు. హైడ్రా కొందరి భవనాలను వెంటనే కూల్చి, మరికొందరికి సమయం ఇస్తున్నదని.. ఒక్కో రకంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు.