ఎవడో ఒకడు మన కోసం చరిత్ర గతిని శాసిస్తే వాడెపో మగవాడంటాం.. వాడుగో మొనగాడంటాం. పంచాంగాల ఆవరణ దాటి, గడియారాలు బద్దలు చేసుకుని కాలం ప్రవహిస్తే అహో అదో శకం అంటాం.. ఒహో అదో యుగం అంటాం..
-వ్లాదిమిర్ మయకోవ్‌స్కీ(లెనిన్ కావ్యం)
తెలంగాణలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు అద్భుతం. సీఎంగా కేసీఆర్ తెలంగాణను జీరోనుంచి హీరోగా మార్చారు. ఏడేండ్ల వ్యవధిలోనే దేశంలోనే రోల్‌మాడల్‌గా తెలంగాణ అభివృద్ధి చెందుతున్నది. సాగునీటిపై ఇతర రాష్ర్టాలు తెలంగాణను అనుసరించాలి. ఇతర రాష్ర్టాల సీఎంలు కేసీఆర్‌ను చూసి ఎంతో నేర్చుకోవాలి.
– 2022 ఫిబ్రవరి 15న ‘వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా’ రాజేందర్‌సింగ్
ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు కొన్ని ప్రాజెక్టులను చేపడుతాయి. అందులో భాగంగానే తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు నిర్మించారు. ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కాళేశ్వరం నిర్మించారు. దీనివల్ల కొన్ని వేల ఎకరాల్లో సాగు జరుగుతున్నది. తెలంగాణ వరి ధాన్యం సాగులో ఎంతో పురోభివృద్ధిని సాధించింది.
– 2025 మే 21న సుప్రీంకోర్టు బెంచ్‌పై న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్రశర్మ
Kaleshwaram | హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): పరపీడన చెరబట్టిన దోపిడీ పరిపాలనలో ప్రజల ఆలోచనలు పరిపరివిధాలా పోతున్న వేళ దారితెలియని సందిగ్ధం. దశ-దిశ నిర్దేశించే దార్శనిక నేత కోసం పరితపిస్తున్న సందర్భం. అప్పటిదాకా పోరు తెలంగాణ వేరు తెలంగాణ అవుతుందా అనేది ఓ బరువైన సందేహం. అసాధారణమైన కాలంలో అరుదైన నేత రంగం మీదకు రావడం ఓ చారిత్రక సందోహం. తెలంగాణ తల్లి తన బిడ్డల విముక్తి కోసం కన్న బిడ్డే కేసీఆర్. బాధల కేదారంలో మొలకెత్తిన శోధన కేసీఆర్. తెలంగాణ అనేది అసాధ్యమైన ఆకాంక్ష అనేది శిలాక్షరమై కుంగదీస్తున్న వేళ.. దిక్కుతోచని సకల జనులకు ఉక్కుసంకల్పం నూరిపోసిన ధన్వంతరి కేసీఆర్. ప్రపంచ చరిత్రలోనే తెలంగాణ వంటి ప్రాంతీయ ఉద్యమం మరొకటి లేదు. ఆయుధమున్ ధరింప అన్న గాంధేయమే గాండీవమయ్యింది. అహింసా మార్గంలో అస్తిత్వ పోరాటాన్ని అద్దరి జేర్చిన అద్వితీయ సత్యాగ్రహి కేసీఆర్.
మలిదశ ఉద్యమం నీడల్లో తారాడుతున్నప్పుడు వేలు పట్టి వెలుగులోకి నడిపించిన దార్శనికుడు కేసీఆర్. కోట్లాది జనం గుండెఘోషను తన గొంతులో పలికించిన మాటకారి. గమ్యాన్ని ముద్దాడిన అలుపులేని బాటసారి కేసీఆర్. ఈ మూడక్షరాల తారకమంత్రం తెలంగాణ విముక్తి గీతమైంది. తెలంగాణ వ్యతిరేకులకు శరాఘాతమైంది. ఈ బక్కపలుచటి నేత గడ్డిపోచను ఉక్కుఊచగా మలిచిన నేర్పరి. తెలంగాణ బంగారు భవితను తీర్చిదిద్దిన కూర్పరి. తెలంగాణ తల్లి గోసను తీర్చేందుకు అతడు ఎక్కని కొండలేదు. మొక్కని బండలేదు. ఆత్మ బలిదానమే ఆఖరు ఆయుధంగా ఉద్యమాన్ని మలుపు తిప్పిన అసహాయ శూరుడు కేసీఆర్. తెలంగాణకు నవశకాన్ని ప్రసాదించిన అసమాన వ్యూహ చతురుడు కేసీఆర్. అతడొక స్వాభిమాన కేతనం. అతడొక అలుపులేని చేతనం. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మహానేత పాతికేండ్ల ప్రస్థానం ఓ ఇతిహాసం. ఓ ఉద్యమగీతం.
విత్తు వేసిన రైతు చినుకు కోసం ఆకాశం వైపు ఆర్తిగా చూసే దైన్యం.. కరువు కోరలు చాస్తే కుటుంబాన్ని వదిలి ముంబై బస్సెక్కే వేదన అనేక దశాబ్దాలు వెంటాడిన తెలంగాణకు కాలం అందించిన భగీరథుడు కేసీఆర్. పాదస్పర్శతో వర్షాలు తెచ్చిన రుశ్యశృంగుడు కేసీఆర్. యుమునా నదిని పంటలకు మళ్లించిన బలరాముడు కేసీఆర్. ఉత్తరాన కాళేశ్వరం, దక్షిణాన పాలమూరు, తూర్పున సీతారామ.. అడుగడుగునా మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, రాజరాజేశ్వరసాగర్, భక్తరామదాసు… ఇలా ఆయన పాదం మోపిన ప్రతిచోటా గంగమ్మ గలగలలే. ఎక్కడో పాతాళానికి పడిపోయిన గంగను నేల మీదికి ఉవ్వెత్తున ఉప్పొంగించిన జలప్రదాత ఆయన.
ఎర్రటి ఎండల్లో చెరువుల మత్తుళ్లు దుంకించిన కార్యశూరుడు ఆయన. పచ్చని పంటలు, గలగలాపారే నీళ్లు, అడుగడుగునా హరిత వృక్షాలు ఇవన్నీ కేసీఆర్ సృష్టి. భారతదేశంలో రైతును గుండెకు హత్తుకున్న మొదటి పాలకుడు కేసీఆర్. పంట పొలాలకు నీరిచ్చి, ఉచితంగా కరెంటిచ్చిన ఘనత ఈ రైతు ప్రేమికుడిదే. చినుకు పడగానే విత్తులకోసం డబ్బులు ఇచ్చిన మొదటి సీఎం కేసీఆర్. రైతు పొలాన్ని దున్నే నాగటి భారాన్ని పంచుకున్న రైతు బాంధవుడు కేసీఆర్. అన్నం పెట్టే రైతుకు వెన్నెముకగా నిలిచిన ఏకైక పాలకుడు కేసీఆర్. తెలంగాణ సకల దరిద్రాలకు నీళ్లే విరుగుడని నమ్మినవాడు. పుట్టిన గడ్డను పచ్చని మాగాణంగా మార్చాలనే తాపత్రయం, అందుకు ఎంత దూరమైనా వెళ్లే తెగువనుంచి పుట్టిందే కాళేశ్వరం.
బ్రిటిష్ కాలంలో సర్ ఆర్ధర్ కాటన్ ధవళేశ్వరం బరాజ్‌ను నిర్మించారు. రైతులకు మేలు జరగాలని గోదావరి జిల్లాలకు నీరందించారు. గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేశారు. అక్కడి ప్రజల గుండెల్లో కాటన్ చిరస్థాయిగా నిలిచారు. ఇప్పటికీ కాటన్‌ను దేవుడిగా కొలుస్తారు. కాటన్లాగే కేసీఆర్ కూడా కాళేశ్వరంతో చరిత్రపుటల్లో.. తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలుస్తారు. కాళేశ్వరం ముమ్మాటికీ తెలంగాణకు వరప్రదాయినే. తెలంగాణ భవిష్యత్తుకు గుండెకాయలాంటిది అని మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్య అక్షరసత్యం. ఒకప్పుడు గోదావరి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉభయగోదావరి జిల్లాలే. ప్రాజెక్టు అంటే ధవళేశ్వరమే.
తెలంగాణ గుండెల మీది నుంచి గోదారమ్మ ఎగిరి దుంకిపోయేది. తెలంగాణను పడావుపెట్టి పరుగులీడేది. కేసీఆర్ హయాంలో ఆ దృశ్యం అదృశ్యమైంది. కేసీఆర్ హయాంలో గోదావరి అంటే కాళేశ్వరం. మేడిగడ్డ. అన్నారం. సుందిళ్ల. ఎల్లంపల్లి. మిడ్ మానేరు. మల్లన్నసాగర్. కొండపోచమ్మసాగర్..! ‘నీరు పల్లమెరుగదు.. అది ఆంధ్రాను ఎరుగు’ అని ఉద్యమకాలంలో పాటలు పాడుకున్నాం. చుక్కనీటి కోసం తలపోసి తలపోసి వలవల ఏడ్చినం. అటువంటి చరిత్రకు కేసీఆర్ చరమగీతం పాడిండు. నీళ్లల్లో చేపలు ఎదురెక్కుతవి అన్న నానుడిని కేసీఆర్ తిరగరాసిండు.
నీళ్లు తెలంగాణ బీడు భూములకు ఎదురేగి పారుతాయని అపరభగీరథుడై నిరూపించి చూపిండు. సరికొత్త జలచరిత్రను సృష్టించిండు. ‘నీరుయునూ ఆహారమే’ అని చిన్నప్పుడు తరగతి గదువుల్లో నేర్చుకున్న పాఠం కేసీఆర్ హయాంలో జీవనవేదమై భాసిల్లింది. తెలంగాణకు కేసీఆర్ ప్రాణహితుడిగా అవతరించిందని రాష్ట్రం ఉప్పొంగిపోయింది. ఎటుచూస్తే అటునీరై ఎగిసిపడింది. జీవన విధ్వంసం జరిగిన చోటే సరికొత్త జల విప్లవాన్ని కేసీఆర్ సృష్టించిండు. మేడిగడ్డే తెలంగాణ జీవగడ్డగా అవతరించి అబ్బురపరిచింది.
ఆంధ్రకేసరి సినిమాలో ‘వేదంలా ఘోషించే గోదావరి…’ అనే సినిమా పాట మాయలో పడి అసలు గోదావరి నది రాజమండ్రి (రాజమహేంద్రి)లోనే పుట్టిందన్నట్టుగా స్థిరపడిపోయిన స్థితిని కేసీఆర్ పటాపంచలు చేశారు. 2003 (జూలై 3 నుంచి ఆగస్టు 1 వరకు)లో వచ్చిన గోదావరి పుష్కరాలను ఇక్కడ ఎందుకు నిర్వహించరని నిలదీసి, తెలంగాణలో మొట్టమొదటిసారి గోదావరి పుష్కరాలను నిర్వహించేలా చేసినవాడు కేసీఆర్. కేసీఆర్ దంపతులు ధర్మపురిలో పుష్కరస్నానం చేసిండ్లు. తెలంగాణలో 560 కిలోమీటర్లు పారే గోదావరి పుష్కరాలను ఉమ్మడి రాష్ట్రంలో బాసర, ధర్మపురి, కాళేశ్వరం, రామన్నగూడెం ఇలా 2003లో వేళ్ల మీద లెక్కబెట్టే ప్రాంతాల్లో నిర్వహిస్తే.. 2015లో నిర్వహించిన పుష్కరాలతో తెలంగాణ గోదావరి నదీతీరమంతా పుష్కరస్నానం చేసింది.
తెలంగాణ రాకముందు తెలంగాణ ఆట, ఆంధ్రా ఆట ఆంధ్రానే ఆడేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పదేండ్లపాటు.. ‘ఎవల ఆట వాళ్లే ఆడాలి. ఎవల వాటా వాళ్లకే దక్కాల’ని కేసీఆర్ బరిగీసి నిలిచిండు. తెలంగాణ వాళ్లకు కేవలం రోడ్లెక్కి ఉద్యమాలు చేయడమే కానీ, వారికి పరిపాలించుకోవడం చేతకాదని ఎగతాళి చేసినవాళ్లకు రికార్డు సమయంలో కాళేశ్వరాన్ని పూర్తిచేసి ప్రపంచమే అబ్బురపడేలా చేసిండు కేసీఆర్. కాళేశ్వరంతో బేసిన్ల సరిహద్దులను చెరిపేసి కృష్ణమ్మతో గోదావరి కరచాలనం చేయించిండు కేసీఆర్. ఆ దృశ్యాన్ని చూసి కండ్లల్లో నిప్పులు పోసుకున్నవారు పదేండ్ల కాలంలో మిన్నకుండిపోయారు.
ఇప్పుడు మెల్లగా గొంతును సవరించుకొని ఘోషిస్తున్నరు. ఇది ‘గోష్’తమాషా అని రాజకీయపుటెత్తులు వేస్తున్నరు. మేడిగడ్డ రెండు పిల్లర్లకు పడ్డ సన్నని పర్రెను ఎరగా చూపి మొత్తం ప్రాజెక్టునే పండబెడుతున్నరు. ఆయన చేసింది ఒక నదిని మళ్లించే సాహసం. లక్షల ఎకరాలను తడిపే బాధ్యత తలదాల్చిన వైనం. పచ్చని తెలంగాణను, ఉజ్వల తెలంగాణను ఊహించిన దార్శనికత. ఏ మంచి కార్యక్రమం చేపట్టినా ఆనందబాష్పాలు ఉంటాయి. కాళ్లలో కట్టెలు, కన్నెర్రతనాలు, కుట్రలు, కూల్చివేతలు ఉంటాయి. చేతులు జోడించే ప్రేమలు, బురద చల్లే దౌష్ట్యాలు ఉంటాయి. కాలం అన్నీ గమనిస్తుంది. కాలమే అసలైన తీర్పరి!!
తెలంగాణ వెతల్లోంచి కాళేశ్వరం పుట్టింది. నీళ్లులేక తెలంగాణ గుండె అగ్నిగుండమైంది. ఉద్యమకాలంలో ఊరూరా పక్షిలా తిరిగిన కేసీఆర్ గోదావరిని ఒడిసిపట్టాలని తీర్మానించుకున్నడు. తెలంగాణ ఉద్యమ ట్యాగ్‌లైన్ అయిన నీళ్లు…నిధులు.. నియామకాల్లో మొదటి నినాదాన్ని కేసీఆర్ నిబద్ధతో పూర్తిచేసిండు. చిన్ననీటి వనరులే తెలంగాణకు పెద్ద ఆదెరువుగా ఉన్నస్థితిని గమనించి మిషన్ కాకతీయతో చెరువులను పూడికతీసి మరమ్మతులు చేసిండు. ఆ వెంటనే ప్రాజెక్టుల రీ ఇంజినీరింగ్‌తో కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసిండు.
ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ ప్రయోజన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను ప్రపంచంలోనే అతి తక్కువ సమయంలో మూడున్నరేండ్లలో పూర్తిచేయడం కేసీఆర్‌కే సాధ్యమైంది. కాళేశ్వరాన్ని ప్రపంచమంతా కీర్తించింది. తెలంగాణ జీవనచిత్రాన్ని మార్చివేసింది. శ్మశానానికిపోతే స్నానానికి నీళ్లులేని దుస్థితి నుంచి ఎడారిగా మారిన గోదావరిని సజీవ జలధారగా మార్చినవాడు కేసీఆర్. నదులు, వాగులు, చెరువులే కాదు చివరికి పాతాళానికి పరుగులు పెట్టిన పారిపోయిన గంగమ్మను భూతల్లికి పాలధారగా మార్చినవాడు కేసీఆర్.
అలనాడు వేలాది చెరువులతో అలరారిన చెన్నపట్నం (చెన్నై) నీటిని రైళ్లల్లో తెచ్చుకొని తన దాహార్తిని తీర్చుకుంటున్న కాలం. మహారాష్ట్ర, గుజరాత్ సహా దేశంలోని అనేక ప్రాంతాలు ఎండాకాలం వచ్చిందంటే రూ.వేల కోట్లను తాగునీటి కోసం ఖర్చు చేస్తున్నాయి. ఇటువంటి దుస్థితి మన హైదరాబాద్‌కు రాకూడదని కలలుకని నిజం చేసినవాడు కేసీఆర్. నాడు అసఫ్‌జాహీ రాజులు భాగ్యనగర నీటి అవసరాలపై దృష్టిపెట్టి చెరువులు నిర్మిస్తే అవి ప్రస్తుత జనావసరాలనూ వంతులవారీగా తీర్చే దుస్థితి ఉన్నదని గ్రహించిన కేసీఆర్ హైదరాబాద్ మహానగరి మరో 50 ఏండ్లకు తాగునీటికి ఇబ్బందులు రాకూడదని దూరదృష్టితో ప్రణాళికలను అమలు చేసిండు.
తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి తాము 152 మీటర్లకు అగ్రిమెంట్ చేస్తే ఎట్లా తగ్గిస్తారని అప్పటి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అనాడు బేగంపేట ఎయిర్‌పోర్టులోనే సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. ‘ఉత్తమ్‌కుమార్ రెడ్డీ… 152 మీటర్లకు మహారాష్ట్రతో అగ్రిమెంట్ చేసుకుని ఉంటే ఆ అగ్రిమెంట్ కాపీ తీసుకురా! నేనింకా అర్ధగంట.. 40 నలభై నిమిషాలు ఇక్కడే ఉంటా. నువ్వా పత్రం తీసుకొచ్చి చూపిస్తే.. ఇక్కడి నుంచి ఇటే రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామా చేస్తా’ అని కేసీఆర్ సవాల్ విసిరారు. ఫేక్ మాటలు, గోబెల్స్ ప్రచారం చేసిన ఉత్తమ్ ఈ రోజు వరకూ ఆ కాపీ చూపించలేదు.
తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు అంటూ కాంగ్రెస్ చేసిన తప్పు వల్ల జరిగిన ఖర్చు వృథా కాకుండా వాడటం కోసమే కేసీఆర్ ప్రాజెక్టును తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చారు. ఏపీ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు 152 మీటర్లు పెంచి ప్రాజెక్టు కడితే, చంద్రాపూర్ జిల్లాలో 22, గడ్చిరోలి జిల్లాలో 8 గ్రామాలు మునిగే ప్రమాదం ఉన్నదని, అందువల్ల ఈ ప్రాజెక్టుకు ఒప్పుకునే ప్రసక్తే లేదని, కాదని ముందుకెళ్తే ప్రజాధనం వృథా కాక తప్పదని హెచ్చరిస్తూ 2013లో మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్‌సింగ్ చౌహాన్ ఏపీ సీఎంకు లేఖ రాశారు. మహారాష్ట్రను ఒప్పించకుండా, నీళ్లు ఉన్నవా లేవా చూడకుండా, వైల్డ్లైఫ్లో ఇరికించి కాంగ్రెస్ తెలంగాణకు ద్రోహం చేసింది. కాంగ్రెస్ చేసిన తప్పును సరిదిద్దడం కోసమే కేసీఆర్ ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చారు.
నాడు కేసీఆర్ ఎంతో ఫెయిర్‌గా ఉన్నారు. ప్రాజెక్టుపై ఏకంగా అసెంబ్లీలోనే పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇది మన దేశంలోనే తొలిసారి. ఇదొక చరిత్ర. శాసనసభలోనే పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు, శాసనసభకు వివరించిన ఓన్లీ సీఎం కేసీఆర్.
‘ఒక ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి సమీక్షలు జరపడం ముఖ్యమంత్రి బాధ్యత. రాష్ట్రంపై, ఈ ప్రాంత ప్రజలపై ప్రేమ ఉన్న వారెవరైనా అదే చేస్తరు. వాస్తవానికి సమీక్ష చేయకపోవడం తప్పు కానీ చేస్తే తప్పా? ఇట్ల మాట్లాడటం ఏం పద్ధతి? రివ్యూ చేస్తే రాజకీయ ప్రమేయమని చెప్పడం అసంబద్ధం..అర్థరహితం. నిజంగా రాష్ట్రం మీద ప్రేమ ఉన్న వ్యక్తి.. ఉద్యమించి, ప్రాణాలకు తెగించి తెలంగాణ సాధించిన వ్యక్తి..తెలంగాణ ప్రజలకు నీళ్లివ్వాలని తపనపడ్డ వ్యక్తి కేసీఆర్ గనక..రాత్రింబవళ్లు కష్టపడ్డడు. తండ్లాడిండు. తొందరగా పూర్తి చేసి నీళ్లు అందించాలని ఆరాటపడ్డడు. అందులో తప్పే మున్నది?
కేసీఆర్‌ది తన రైతులకు నీళ్లు ఇవ్వాలనే తపన, తండ్లాట, ఆర్తి.. కాంగ్రెస్ నాయకులకు రాజకీయ పబ్బం గడుపుకోవాలనే ఆరాటం. అంతిమంగా
నిలిచేది న్యాయం… గెలిచేది సత్యం..
జై తెలంగాణ, జై కేసీఆర్
– హరీశ్‌రావు వ్యాఖ్యలు
చరిత్రలో చాలా చూశాం. నాడు బ్రిటిష్‌కాలంలో సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజీ నిర్మించారు. రైతులకు మేలు జరగాలని కష్టపడి గోదావరి జిల్లాలకు నీరందించారు. ఆ జిల్లాలను సస్యశ్యామలం చేశారు. అలాంటి కాటన్ మీద బ్రిటిష్ ప్రభుత్వం హెమ్మింగ్టన్ కమిషన్‌ను వేసింది. బ్యారేజీ కట్టి నీళ్లు ఇచ్చిన కాటన్‌ను ఆ కమిషన్ 900 ప్రశ్నలడిగింది. విచారణ పేరుతో చాలా కాలం వేధించింది. అయినా కాటన్ గోదావరి జిల్లా ప్రజల గుండెల్లో జలప్రదాతగా నిలిచి ఉన్నారు. ఇప్పటికీ ఆయనను దేవుడిలా కొలుస్తారు.
కాటన్లాగే కేసీఆర్ కూడా తెలంగాణ రైతులకు మేలు జరగాలని, ఇక్కడి ప్రజల నీటి కష్టాలు శాశ్వతంగా తొలగిపోవాలని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. ఎన్ని కమిషన్లు వేసినా, ఎవరెన్ని ఆరోపణలు చేసినా కేసీఆర్ చరిత్రపుటల్లో, తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలుస్తారు. కాళేశ్వరం ముమ్మాటికీ తెలంగాణకు వరప్రదాయనే. రాష్ట్ర భవిష్యత్తుకు అది వెన్నెముక, గుండెకాయ! తెలంగాణకు జీవధార!