హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): అత్త మీద కోపం దుత్త మీద చూపిన చందంగా ఉన్నది కాంగ్రెస్ సర్కారు తీరు. పరిపాలనలో అసమర్థతను, వైఫల్యాలను ప్రతిపక్షం ఎండగడుతుంటే సమాధానం చెప్పలేక.. ఇంజినీర్లపై ఆంక్షలు విధిస్తున్నది. ఎవరితోనూ మాట్లాడవద్దు? సమాచారం ఇవ్వవద్దు అంటూ హుకూం జారీ చేస్తున్నది. ఓ పక్క ప్రభుత్వమే లీకులు ఇస్తూ మరోవైపు లీకులు ఇచ్చే అధికారులపై విచారణ జరిపిస్తామని హెచ్చరిస్తున్నది. ప్రభుత్వ తీరుపై ఇరిగేషన్‌వర్గాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ‘గోదావరి- బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ పేరుతో ఏపీ చేస్తున్న జల దోపిడీ- కాంగ్రెస్ మౌనం’ అనే అంశంపై తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీశ్‌రావు ఇటీవల ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. బనకచర్ల లింక్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు వాటిల్లబోయే నష్టాన్ని వివరించారు.
అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద సర్కారు చేస్తున్న దుష్ప్రచారంపై కూడా ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఏర్పాటు చేశారు. వాటికి సమాధానం చెప్పని కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు సాగునీటిపారుదలశాఖలోని ఇంజినీర్లపై రుసరుసలాడటం గమనార్హం. మాజీ మంత్రికి, మీడియాకు సమాచారం ఎవరిస్తున్నారు? లేఖలను, ప్రభుత్వపర అంశాలను ఎవరు లీకు చేస్తున్నారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నదని ఇంజినీర్లు వాపోతున్నారు.
కొందరిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతుండగా, మరికొందరిపై పార్టీ ముద్ర వేస్తూ ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఇంజినీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంకితభావంతో పనిచేసే అనుభవజ్ఞులైన ఇంజినీర్లను సైతం అనుమానిస్తూ అవమానిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లీకులు ఎవరు ఇస్తున్నారో ఎంక్వయిరీ చేయాలని ఐబీ అధికారులను పురమాయించిందని ఇంజినీర్లు ఆరోపిస్తున్నారు. రాజకీయాలకు తమను బలిచేయడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. సచివాలయంలో మంత్రి పేశీ నుంచే సమాచారం లీకవుతున్నదని, వారిని వదిలి జలసౌధ ఇంజినీర్లను బద్నాం చేయడమేంటని నిప్పులు చెరుగుతున్నారు. ప్రభుత్వం ఇకనైనా తమ తీరును మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.