హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా స్పీకర్ నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారని ఆశిస్తున్నామని తెలిపారు. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టులాంటిదన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఖాయమని హైకోర్టు తీర్పుతో తేలిపోయిందని అభిప్రాయపడ్డారు.
ఫిరాయింపుదారుల అనర్హత విషయంలో స్పీకర్ తన నిర్ణయాన్ని ఇక జాప్యం చేయలేరని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. మణిపూర్, మహారాష్ట్రలో కాంగ్రెస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై అక్కడి స్పీకర్ కార్యాలయం జాప్యం లేకుండా నిర్ణయం తీసుకుందని అన్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో స్పీకర్ నాలుగు వారాల్లో ఆ ఎమ్మెల్యేలపై వేటు వేస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
పార్లమెంట్ చేసిన చట్టాలు, సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులు దేశానికి మార్గనిర్దేశాలు అని, తక్కిన వ్యవస్థల కన్నా రాజ్యాంగ వ్యవస్థలు వాటిని తు చ తప్పకుండా పాటించాలని ప్రముఖ న్యాయవాది, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమా భరత్‌కుమార్ పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యవస్థలు పరస్పరం గౌరవించుకుంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అద్భుతంగా మనగలుగుతుందని అన్నారు. హైకోర్టు తీర్పును స్పీకర్ కార్యాలయం పరిగణనలోకి తీసుకొని నిర్దేశిత గడువులో నిర్ణయాన్ని వెల్లడిస్తుందని ఆశిస్తున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.