Harish Rao | హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నుంచి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను మినహాయించాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. సర్వేకు ఉపాధ్యాయులను వినియోగించటం విద్యాహక్కుచట్టం ఉల్లంఘనేనని స్పష్టంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 36,559 ఎస్జీటీలు, 3414 మంది ప్రధానోపాధ్యాయులను సర్వేలో భాగం చేస్తూ విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులు నిబంంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.
ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలపై ఉన్న నమ్మకం రేవంత్‌రెడ్డి పాలన పుణ్యమా అని రోజురోజుకీ దిగజారుతున్నదని, వాటికితోడు సీఎం నిర్లక్ష్యం, అనాలోచిత నిర్ణయాలతో విద్యార్థులు, తల్లిదండ్రులకు తోడు ఉపాధ్యాయులకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సర్వే పేరుతో టీచర్లు, విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తూ, విద్యావ్యవస్థను సర్కార్ నిర్వీర్యం చేస్తున్నదని మండిపడ్డారు. ఉపాధ్యాయులను జనాభా గణన లెకలు, ప్రకృతి వైపరీత్యాల్లో సహాయ విధులు, పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ, స్థానిక ప్రభుత్వాలకు జరిగే ఎన్నికలకు సంబంధించిన విధులకు మాత్రమే వినియోగించాలని విద్యాహకు చట్టం పేర్కొన్న విషయాన్ని హరీశ్‌రావు గుర్తుచేశారు.