సిద్దిపేట, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ సర్కార్ తమను మస్తు తిప్పలు పెడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సిద్దిపేట జిల్లా రాఘవాపూర్‌లో బుధవారం రైతులు యూరియా కోసం బారులుతీరగా అటుగా వెళ్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు వారి దగ్గరకు వెళ్లి పలకరించారు. ఈ సందర్భంగా రైతులు భాగ్యమ్మ, జత్రి పరశురాములు, బట్టు మల్లయ్య, బట్టు తిరుపతి తదితరులు హరీశ్‌రావుకు తమ సమస్యలను విన్నవించారు. యూరియా కోసం నిత్యం తండ్లాడుతున్నామని, పొద్దంతా సొసైటీల వద్ద నిరీక్షించాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఒక ఆధార్ కార్డుకు ఒకే బస్తా ఇస్తామంటున్నారని తెలిపారు.
కేసీఆర్ హయాంలో ఈ గోస లేదని.. కాంగ్రెస్ వచ్చాక నీళ్లు లేవు, యూరియా లేదని వాపోయారు. మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. రైతులను అరిగోస పెడుతున్న కాంగ్రెస్, బీజేపీలకు వారి ఉసురు తగులుతుందని ఆరోపించారు.. యూరియా కోసం రైతులు రోడ్డెకి ధర్నాలు చేసే దుస్థితి కల్పించాయని కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలపై మండిపడ్డారు. రైతులకు యూరి యా ఇవ్వడం చేతగాని, దద్దమ్మ ప్రభుత్వా లంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచి రాష్ట్రానికి ఎరువుల కొరత తీర్చడంలో విఫలమయ్యారని ధ్వజమెత్తారు.