హైదరాబాద్ : రైతులకు 24 గంటల కరెంట్ ( Electricity ) అవసరం లేదు. 3 గంటల కరెంట్ చాలని ఈఆర్సీ ఎదుట కాంగ్రెస్ నేత, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి ( Kodanda Reddy ) చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మాజీ మంత్రి, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు ( Harish Rao ) ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నాయకుడు వ్యాఖ్యలు రేవంత్ ప్రభుత్వ రైతు వ్యతిరేక ముఖాన్ని బట్టబయలు చేశాయని పేర్కొన్నారు. అమెరికా వేదికగా రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను ఇప్పుడు అమలు చేసే దిశగా కుట్రలు జరుగుతున్నాయని వెల్లడించారు. పొలం అంటే ఏమిటో.. బోరు ఆగిపోతే పంట ఎలా ఎండిపోతుందో.. రైతు రాత్రింబవళ్లు ఎలా కష్టపడుతాడో తెలియని వాళ్లు మాత్రమే 3 గంటల కరెంట్ చాలని మాట్లాడతారని ఆరోపించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుకు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇచ్చి తెలంగాణ వ్యవసాయాన్ని దేశానికి ఆదర్శంగా నిలబెట్టిందని, కాంగ్రెస్ మాత్రం అదే రైతును మళ్లీ చీకట్లలోకి నెట్టే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత రుణమాఫీని అటకెక్కించారని, రైతు బంధు బంద్ చేశారని, పంట బోనస్ బోగస్ చేశారని మండి పడ్డారు. ఎరువుల సరఫరాలో ఫెయిల్ అయ్యారు. పంట కొనుగోళ్లు చేయక రైతుల ప్రాణం తీస్తున్నారని విమర్శించారు.
ఇవి చాలదన్నట్లు కేసీఆర్ ఎంతో శ్రమించి అమలు చేసిన 24 గంటల కరెంట్‌ను ప్రణాళిక ప్రకారం ఖతం పట్టిస్తున్నారని ఆరోపించారు. రైతు డిస్కం వెనుక దాగి ఉన్న కాంగ్రెస్ అసలు కుట్ర ఇదేనా? అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. కరెంట్ కోతలతో, రైతులకు వాతలు పెట్టాలని చూస్తున్న రేవంత్ కుట్రలను యావత్ తెలంగాణ రైతాంగం గమనిస్తోందని, రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందని జోస్యం చెప్పారు.