రవీంద్రభారతి/హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): మనం చనిపోయినా ఇతరుల రూపంలో జీవించడమే అవయవ దానమని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. వ్యక్తులు ఏదైనా కారణం వల్ల బ్రెయిన్‌డెడ్ అయితే వారి కుటుంబ సభ్యులు అవయవదానం చేయడానికి ముందుకు రావడం గొ ప్ప విషయమని అన్నారు. అవయవ దాతలు, వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. 2020లో జీవన్‌దాన్ ఆధ్వర్యంలో అవయవ దానం చేసిన వారి కుటుంబ సభ్యులకు శనివా రం రవీంద్రభారతిలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. దీనికి మంత్రులు హరీశ్‌రావు, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. 2020లో 88 మంది అవయవ దానం చేశారని, తద్వారా వందల మందికి ప్రాణదానం చేశారని చెప్పారు.
దేశంలోనే అవయవ దానానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభించి, పారదర్శక విధానం అవలంబిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు వెయ్యి మంది అవయవ దానం చేశారని, వారి ద్వారా సుమారు నాలుగు వేల మంది ప్రయోజనం పొందారని అన్నారు. ప్రస్తుతం జీవన్‌దాన్ సంస్థలో 8 వేల మంది రిజిస్టర్ అయ్యారని చెప్పారు. వారు నాలుగైదేండ్లుగా దాతల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఇటీవల సీపీఐ నేత నారాయణ సతీమణి వసుమతి, స్వతంత్ర సమరయోధురాలు మల్లు స్వరాజ్యం పార్థివ దేహాలను మెడికల్ కాలేజీలకు ఇచ్చారన్నారు. అటు.. గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌లో అవయవ మార్పిడి చికి త్సలు ఉచితంగా చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటికే 400కు పైగా శస్త్రచికిత్సలు జరిగాయని చెప్పారు. కార్యక్రమంలో డీఎంఈ రమేశ్‌రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ మనోహర్, కార్పొరేటర్ విజయరెడ్డి పాల్గొన్నారు.