మహబూబ్‌నగర్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘రాష్ట్రంలో ఏ గ్యారెంటీని అమలు చేసినవ్? మహారాష్ట్రకు పోతే అక్కడ కాంగ్రెస్‌ను ప్రజలు ఎండగట్టిండ్రు. రేపు కేరళలో కూడా కాంగ్రెస్ ఓడిపోతది. రేవంత్‌రెడ్డి ఐరన్ లెగ్’ అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. శుక్రవారం నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం కొత్తపల్లి మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో గిరిజనులు ఆత్మగౌరవంగా భావించే సద్గురు సంత్ శ్రీగురు లోకామసంద్ మహరాజ్ బావోజీ ఆలయాన్ని హరీశ్ దర్శించుకున్నారు. మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, అంజయ్య యా దవ్‌తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియా సమావేశంలో హరీశ్ మాట్లాడుతూ ‘ తెలంగాణలో ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయనోడు.. ఇక్కడ చేసిందేమీ లేదు కానీ.. కేరళకు పోయి తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేసినం.. ఇక్కడ కూడా చేస్తం అని రేవంత్‌రెడ్డి వచ్చీరాని ఇంగ్లిష్, హిందీలో పెద్దపెద్ద డైలాగ్‌లు కొడుతున్నడు’ అని దుయ్యబట్టారు. రెండు సీజన్లలో కృష్ణా నీటిని లిఫ్ట్ చేయకుండా ఆంధ్రాకు వదిలిపెట్టి పాలమూరు ప్రజలకు రేవంత్‌రెడ్డి తీవ్ర అన్యాయం చేశాడని మండిపడ్డారు.
కమీషన్ల కోసమే కొడంగల్ ప్రాజెక్టు
పాలమూరు-రంగారెడ్డి ద్వారా నీళ్లిస్తే ఆ పేరు కేసీఆర్‌కు వస్తుందనే కుట్రతోనే పాలమూరు ప్రజల గుండెల మీద తన్నుతూ ప్రాజెక్టును రేవంత్‌రెడ్డి ఆపేశాడని హరీశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘పాలమూరు ప్రాజెక్టు ద్వారా మక్తల్, నారాయణపేటకు లక్ష ఎకరాలు, కొడంగల్‌కు లక్షన్నర ఎకరాలకు నీళ్లు వస్తయి. కానీ నువ్విప్పుడు కొత్తగా రూ.4,500 కోట్లతో తెస్తున్న లిఫ్ట్ ద్వారా మక్తల్‌కు 25 వేలు, నారాయణపేటకు 20 వేలు, కొడంగల్‌కు 50 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు వస్తయి’ అని తెలిపారు. కేవలం కమీషన్ల కక్కుర్తి కోసమే ఈ ప్రాజెక్టు చేపడుతున్నారని విమర్శించారు. తాము నిర్మించిన ఏదుల, వట్టెం ప్రాజెక్టుల ద్వారా మొన్న వచ్చిన నీళ్లు నింపుకొని ఉంటే ఈ పాటికి పంటలు పండేవని గుర్తుచేశారు.
గిరిజనులను మోసం చేస్తున్న సర్కార్
ఎస్టీ కార్పొరేషన్‌కు బడ్జెట్లో రూ.2,730 కోట్లు చూపించి.. ఖర్చు చేసింది మాత్రం రూ.52 కోట్లేనని హరీశ్ తెలిపారు. ఎస్టీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేద ని, సేవాలాల్ కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు కేటాయించి రూపాయి కూడా విడుదల చేయకుండా సేవాలాల్ మహరాజ్ గౌరవాన్ని కాం గ్రెస్ తగ్గించిందని మండిపడ్డారు. నేటి వరకూ లంబాడీలకు మంత్రి పదవి లేదని, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని తూర్పారబట్టారు. ‘నీ సొంత నియోజకవర్గం కొడంగల్ నుంచే సవాల్ విసురుతున్నా.. కొడంగల్‌లో ఏ ఊరికి పోదామో చెప్పు.. ఏ ఊర్లో వంద శాతం రుణమాఫీ జరిగిందో చూద్దాం రా రేవంత్‌రెడ్డీ’.. అని సవాల్ విసిరారు. ‘జైళ్లలో పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తావా? ఇదేనా నీకు ఎస్టీల మీద ఉన్న ప్రేమ?’ అని నిలదీశారు.
పట్నం చొరవతోనే కొడంగల్ అభివృద్ధి
కొడంగల్ ప్రాంతంలో గిరిజనులు ఆత్మగౌరవంగా భావించే లోకామసంద్ మహరాజ్ బావోజీ ఆలయానికి గతంలో కనీసం వాగు దాటి వచ్చే పరిస్థితి ఉండేది కాదని, గత ఎమ్మె ల్యే నరేందర్‌రెడ్డి కృషితో నాటి సీఎం కేసీఆర్ రూ.8 కోట్లు ఇచ్చి వాగుపై బ్రిడ్జి నిర్మించారని హరీశ్ గుర్తుచేశారు. మరో రూ.80 లక్షలు ఆలయ నిర్మాణం కోసం.. రూ.50 లక్షలు బం జారా భవన్ కోసం కేటాయించారని చెప్పారు. కొడంగల్ తండాల్లో ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. దొడ్డి కొమురయ్య జయంతి సందర్భం గా మహబూబ్‌నగర్‌లో ఆయన విగ్రహానికి మాజీ మంత్రులు, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి నివాళులర్పించారు.
పోలీసుల అత్యుత్సాహం
హరీశ్ పర్యటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. హరీశ్ బావోజీ ఆలయాన్ని దర్శించుకొని బయటకు వచ్చి మళ్లీ లోపలికి వెళ్లే క్రమంలో కోస్గి సీఐ సైదులు అడ్డుకున్నారు. పట్నం నరేందర్‌రెడ్డి పరిస్థితిని వివరించినా పోలీసులు వినలేదు.
ఉన్నవి ఊడగొట్టడం తప్ప కొత్తగా నువ్వు చేసిందేమున్నది రేవంత్‌రెడ్డీ? కేరళ ప్రజలు నీకంటే తెలివైనోళ్లు.. గూగుల్‌లో వెతికితే తెలంగాణలో ఎన్ని గ్యారెంటీలు అమలయ్యాయో వాళ్లకు తెలుస్తది.. నీ బాగోతం బయటపడుతది. -హరీశ్‌రావు