హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో నిరసనలు తెలుపుతున్న విద్యార్థుల డిమాండ్లను, వారి ఆవేదనను పాలకులు వినాలని, అణచివేత చర్యలతో వారి గొంతు నొక్కే ప్రయత్నాలు గర్హనీయమని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు హితవుపలికారు. విద్యార్థుల నిరసన ప్రదర్శనను అణచివేసేందుకు ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ వ్యాపార సముదాయాలను మూసివేయించడం, భారీగా బలగాలను మోహరించి భయానక వాతావరణాన్ని సృష్టించడం సరికాదని పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసుల, అధికారుల ఆంక్షలపై గురువారం ఎక్స్ వేదికగా ఆయన నిరసన వ్యక్తంచేశారు. ‘ప్రజాస్వామ్యం అనేది నిర్బంధాలు, బారికేడ్ల ద్వారా కాకుండా నిరంతరం జరిగే చర్చలు, సంభాషణల ద్వారానే బలోపేతమవుతుంది. ఒక నిరసనను అడ్డుకోవడానికి భయాందోళనలు సృష్టించడం సమాజానికి తప్పుడు సంకేతాలు ఇస్తుంది’ అని ఆయన స్పష్టంచేశారు. సాయంత్రం 6:30 గంటలకల్లా కన్నాట్ ప్లేస్‌లోని దుకాణాలు, ఆఫీసులు, రెస్టారెంట్లను మూసివేయాలని, ఎటువంటి ఆస్తినష్టం, వినాశనం జరుగకుండా నివారించేందుకు యజమానులు సహకరించాలని కోరుతూ న్యూఢిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్ (ఎన్డీటీఏ) అధ్యక్షుడు అతుల్ భార్గవ జారీచేసిన అత్యవసర సర్యులర్‌ను తన ట్వీట్‌కు జతచేశారు.