Harish Rao | కేసీఆర్ ముందుచూపుతో గోదావరి జలాలను ఖమ్మం జిల్లాకు తరలించి సస్యశ్యామలంగా చేయాలన్న సంకల్పంతో నిర్మించిన సీతారామ ప్రాజెక్టు ఫలాలు రైతులకు అందడం సంతోషంగా ఉందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎట్టకేలకు సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు మోటార్లు ఆన్ చేసి నీళ్లు అందించడంతో రైతులు కేసీఆర్ కృషిని గుర్తు చేసుకుంటున్నారన్నారు.
గోదావరి జలాలను కృష్ణా జలాలతో అనుసంధానం చేసే ఈ ప్రాజెక్టు విలువ ఏమిటో ఇప్పుడు అనుభవంలోకి వచ్చిందని.. నదీ జలాల సద్వినియోగానికి కేసీఆర్ చిత్తశుద్ధితో చేసిన కృషికి సీతారామ ప్రాజెక్టు ఓ సజీవ సాక్ష్యమన్నారు. సీతారామ ప్రాజెక్టు మోటార్లు ఆన్ చేసినట్టే, కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి మోటార్లు ఆన్ చేసి సాగు నీటి కోసం ఎదురుచూస్తున్న రైతాంగాన్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మరోసారి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.