సిద్దిపేట : విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చినప్పుడు వారి జీవితం మారుతుంది. ప్రజా ప్రతినిధిగా మేము, ఉపాధ్యాయులు శ్రద్ధ చూపినప్పుడే వారికి మంచి జరుగుతుందని మాజీ మంత్రి హరీశ్ రావు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు. నేటి నుంచి పాఠశాలల ప్రారంభం నేపథ్యంలో సిద్దిపేట ప్రభుత్వ బాలుర పాఠశాలలో విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్స్ పంపిణీ చేసి మాట్లాడారు.
రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా సిద్దిపేట జిల్లా పదో తరగతి ఫలితాల్లో అగ్రస్థానంలో నిలిచింది. అభివృద్ధిలో విద్యలో ఏ రంగంలో అయినా సిద్ధిపేట జిల్లా రాష్ట్రంలో అగ్రగామిగా నిలుస్తూ వస్తుందన్నారు. సిద్దిపేటలోని ప్రభుత్వ పాఠశాలలను మెరుగైన వసతులతో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిది ద్దుకున్నామని చెప్పారు. అలాగే పాఠశాలలో హాస్టల్‌కి వెంటనే డైనింగ్ రూమ్ మంజూరు చేయిస్తానని హామీ ఇస్తున్నాను.
కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా మన ఊరు -మనబడి కార్యక్రమాన్ని కొనసాగించి ప్రభుత్వ పాఠశాలను మరింత అభివృద్ధి చేయాలని సూచించారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం అన్ని ప్రభుత్వం స్కూళ్లలో ఇచ్చిన మాట ప్రకారం పారిశుద్య సిబ్బందిని, ఉచిత కరెంటు ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరారు. వెంటనే 25 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు నింపాలన్నారు. సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు నా వంతు కృషి నిత్యం ఉంటుందని హామీనిచ్చారు.