హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న రోజునే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) రాత పరీక్షను నిర్వహించడం సరికాదని వెంటనే ఆ పరీక్షను వాయిదా వేయాలని హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. ఈరోజు హైకోర్టు సీనియర్ న్యాయవాది శివ శేఖర్ ఆధ్వర్యంలో న్యాయవాదుల బృందం హరీశ్ రావుని కలిసి వినతిపత్రం సమర్పించారు. డిసెంబర్ 14న జరగాల్సిన ఏపీపీ పరీక్షను వాయిదా వేయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వారు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి సంబంధించి డిసెంబర్ 14 న రాత పరీక్ష నిర్వహించాలని నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే, అదే రోజు రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ జరగనుంది. ఈ పరీక్షకు దాదాపు 4 వేల మంది న్యాయవాదులు హాజరవుతున్నారు. పరీక్షా కేంద్రాలు హైదరాబాద్‌లో ఉన్నాయి. కానీ అభ్యర్థుల ఓట్లు వారి సొంత గ్రామాల్లో ఉన్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రోజంతా పరీక్ష ఉండటంతో, అభ్యర్థులు తమ గ్రామాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవడం అసాధ్యం.
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ప్రతి పౌరుడికి ఉండాలి. పరీక్ష పేరుతో న్యాయవాదులను ఓటింగ్‌కు దూరం చేయడం అన్యాయం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విషయంపై స్పందించి, డిసెంబర్ 14న జరగాల్సిన ఏపీపీ పరీక్షను మరో తేదీకి మార్చాలని హరీశ్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యాయవాదులకు నష్టం జరగకుండా చూడాలని ఆయన కోరారు.