హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన ఇంటి నుంచి ఎప్‌సెట్ ఫలితాలను విడుదల చేయడం.. ఆయన అహంభావానికి నిదర్శనమని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. 77 ఏండ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా వ్యవహరించలేదని ధ్వజమెత్తారు. పరిపాలనపై, విద్యార్థులపై ఆయనకున్న చులకనభావాన్ని ఇది తెలియజేస్తుందని ఆదివారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
సెక్రటేరియట్ ముఖం చూడకుండా కంట్రోల్ కమాండ్ సెంటర్ లేదా జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి పాలన కొనసాగిస్తున్న సీఎం ఇటు పోలీసులు అటు అధికారులను పనిచేసుకోనివ్వడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ మార్క్ ప్రజాపాలన అంటే ఇదేనా? అని నిలదీశారు. ఎప్‌సెట్‌లో మెరుగైన ర్యాంకులు సాధించిన విద్యార్థులకు హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు.