హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): ‘ఆత్మశుద్ధిలేని యాచార మదియేల.. భాండశుద్ధి లేని పాకమేల? అన్నట్టుంది కాంగ్రెస్ పరిస్థితి’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. సన్నాలకు బోనస్ బంద్, ఇందిరమ్మ జాతీయ భరోసా బంద్, రాజీవ్ యువ వికాసం అమలుకాకముందే బంద్.. ఇలా చెప్పుకుంటూపోతే.. కాంగ్రెస్ పాలనలో అన్నీ బంద్ పెట్టారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ సర్కారు అమలుచేసిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించిందని సోమవారం ఎక్స్ వేదికగా విమర్శించారు. ప్రజలను నమ్మించడం, నయవంచన చేయడంలో కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచిందని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో గొర్రెల పంపిణీ చేస్తామని చెప్పారని, కానీ, గొర్రెల పంపిణీ దేవుడెరుగు, కట్టిన డీడీ పైసలు కూడా వాపస్ ఇవ్వలేని దుస్థితి నెలకొన్నదని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి మాటలు విని విసిగిపోయిన యాదవ, కురుమ సోదరులు.. గాంధీభవన్‌కు గొర్రెలు తోలుకొచ్చి.. నిరసన తెలియజేశారని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఏకమై.. గాంధీభవన్‌కు పోటెత్తకముందే కాంగ్రెస్ సర్కార్ కండ్లు తెరువాలని హితవు పలికారు. చెప్పిన గ్యారెంటీలు, ఇచ్చిన హామీలు ఇకనైనా అమలుచేయకుంటే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.
మేడిగడ్డకు ఒక నీతి, సుంకిశాలకు ఇంకో నీతా?
మేడిగడ్డకు ఒక నీతి, సుంకిశాలకు ఇంకో నీతా? అని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. మేడిగడ్డకు చిన్న మరమ్మతులు చేసి, గోదావరి నీళ్లను లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నా.. బీఆర్ఎస్ను బద్నాం చేయాలనే సింగిల్ పాయింట్ ఎజెండాతో ముందుకెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. సుంకిశాల విషయంలో మాత్రం తమ లోపాలు ఎక్కడా బయటపడుతాయోనని, గుట్టుచప్పుడు కాకుండా రిపేర్లు మొదలుపెట్టిందని పేర్కొన్నారు. ‘సుంకిశాల మీద.. ఎక్స్పర్ట్ కమిటీ ఎైంక్వెయిరీ.. విజిలెన్స్ కమిషన్ విచారణ.. జ్యుడీషియల్ కమిషన్.. ఎన్డీఎస్ఏ రిపోర్టు.. ఇలాంటివేమీ లేకుండానే, గుట్టుచప్పుడు కాకుండా, రిపేర్ చేయిస్తారు’ అని విమర్శించారు. కానీ, అదే మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగితే అన్నీ కమిటీలు ఉంటాయని దుయ్యబట్టారు. ఎన్డీఎస్ఏతోపాటు ఎక్స్పర్ట్ కమిటీ, రిటైర్డ్ ఇంజినీర్స్ అసోసియేషన్ వంటి వివిధ సంస్థలు.. కుంగిన పిల్లర్లను రిపేర్ చేయాలని అభ్యర్థించినా, నిర్మాణ కంపెనీ రిపేర్ చేయడానికి సిద్ధం అని చెప్పినా కూడా కేవలం రాజకీయ స్వార్థంతో తెలంగాణ ప్రయోజనాలను పక్కనపెట్టడం, కాంగ్రెస్ మార్కు ‘ప్రజా వ్యతిరేక-ప్రతిపక్ష వేధింపు’ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు.