హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ) : ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గాడిద గుడ్డు మిగిలిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవాచేశారు. హర్యానా, మహారాష్ట్రతోపాటు తాజాగా ఢిల్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంలో రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి పాత్ర అమోఘమని శనివారం ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో హామీలు అమలుచేయకుండా ఇతర రాష్ర్టాల్లో ప్రచారం చేస్తే మీకు ఓట్లు పడతాయా? అని ప్రశ్నించారు.
మీ గ్యారెంటీల నిజస్వరూపం దేశవ్యాప్తంగా బట్టబయలైందని విమర్శించారు. ఢిల్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఆగమేఘాల మీద చేసిన కులగణన బెడిసికొట్టిందని విమర్శించారు. ఇప్పటికైనా తప్పులు ఒప్పుకుని రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పి మళ్లీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. 6 గ్యారెంటీలు, 420 హామీలను రాష్ట్రంలో అమలుచేసిన తర్వాతే ఇతర రాష్ర్టాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని సీఎం రేవంత్‌రెడ్డికి సలహా ఇచ్చారు. లేదంటే రేవంత్ ఎక్కడ అడుగుపెట్టినా ఇవే ఫలితాలు పునరావృతమవుతాయని, రానున్న స్థానిక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.