Harish Rao : జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పైన, కూటమి ప్రభుత్వంపైన ప్రముఖ రాజనీతి విశ్లేషకుడు ప్రొఫెసర్ కే నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. వైసీపీ అధినేత జగన్‌ను అరెస్ట్ చేయాలంటూ పవన్ కల్యాణ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరినట్టు, జగన్ మనకు లాంగ్ టైమ్ ఫ్రెండ్, ఆయనతో స్నేహంగా ఉండాలని పవన్‌కు అమిత్ షా చెప్పినట్టు ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన కామెంట్స్‌ను జనసేన పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది.
ప్రొఫెసర్ నాగేశ్వర్ వైసీపీకి తొత్తుగా మారి అవాస్తవాలు మాట్లాడుతున్నారంటూ సోషల్ మీడియాలో జనసైనికులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లలో ఆయనపై ఫిర్యాదులు కూడా చేశారు. దాంతో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్న ప్రొఫెసర్ నాగేశ్వర్.. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయినప్పటికీ ఆయనపై నమోదైన కేసులను ఏపీ పోలీసులు ఇంకా కొనసాగిస్తుండడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై తాజాగా తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు స్పందించారు.
ఎక్స్ వేదికగా ఆయన ఏపీ ప్రభుత్వ తీరును తప్పుబడుతూ ఒక పోస్ట్ చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన తర్వాత కూడా, కక్షపూరిత ధోరణితో ఆయనపై కేసులు నమోదు చేసి వేధించడం ఎంతమాత్రం సరికాదని హరీశ్ రావు హితవు పలికారు. భావప్రకటనా స్వేచ్ఛను గౌరవించాలని, ప్రొఫెసర్‌పై పెట్టిన అన్ని కేసులను ఏపీ ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అయితే హరీశ్ రావు చేసిన ఈ పోస్టుపై ఏపీ ప్రభుత్వం, జనసేన శ్రేణులు ఎలా స్పందిస్తాయో చూడాలి.