హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 6 (నమస్తే తెలంగాణ)/మన్సూరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇంజినీరింగ్ విద్యార్థి నవీన్ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. నిందితుడు హరిహర కృష్ణ ప్రియురాలు కట్ట నీహారికారెడ్డి, స్నేహితుడు హసన్‌ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నవీన్ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ మీడియాకు వెల్లడించారు. నవీన్ హత్య గురించి నీహారికకు తెలిసినా పోలీసులకు చెప్పలేదని, హసన్ కూడా హత్య విషయం తెలిసి సహకరించాడని, ఇది చట్ట ప్రకారం నేరం కాబట్టి అరెస్టు చేశామని పేర్కొన్నారు. నీహారికతోపాటు హసన్‌ను రిమాండ్ తరలించామని చెప్పారు. దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు.
ఖర్చుల కోసం రూ.1500 తీసుకున్నడు..
ప్రేమకు అడ్డొస్తున్నాడని తన స్నేహితుడైన నేనావత్ నవీన్‌నాయక్ (22)ను గత నెల 17న హరిహర కృష్ణ దారుణంగా హతమర్చాడు. పెద్దకత్తితో తల, గుండె, మర్మాంగం వేరు చేశాడు. అనంతరం తుర్కయంజాల్‌లో నివాసముండే తన స్నేహితుడైన హసన్ (21) ఇంటికి వెళ్లి నవీన్ హత్య విషయాన్ని తెలిపి సాయం కోరాడు. ఇద్దరు కలిసి హత్య చేసిన ప్రదేశానికి వెళ్లి నవీన్ శరీర భాగాలను మన్నెగూడ ప్రాంతంలో వేశారు. రాత్రి వాట్సాప్ చాటింగ్‌లో నీహారికకు హత్య వివరాలు చెప్పి, మరుసటి రోజు ఆమె ఇంటికి వెళ్లాడు. ఖర్చుల కోసం రూ.1,500 తీసుకున్నాడు. రెండు రోజుల తర్వాత 20న హరిహరకృష్ణ నీహారిక ను తీసుకెళ్లి హత్య చేసిన ప్రదేశాన్ని దూరం నుంచి చూపాడు. అనంతరం ఇద్దరు ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. రెండురోజుల తర్వాత నవీన్ శరీరభాగాలను పడేసిన చోటుకు హసన్‌తో కలిసి వెళ్లి వాటిని సేకరించాడు. తిరిగి హత్య చేసిన ప్రాంతానికి తీసికెళ్లి వాటిలో కొన్ని భాగాలను కాల్చేశారు. 24న నీహారిక ఇంటికి వెళ్లి కలుసుకున్నాడు. అక్కడే స్నానం చేసి, ఆమె సెల్ఫోన్లో ఉన్న వాట్సాప్ చాటింగ్, నవీన్ మృతదేహం ఫొటోలను, కాల్ డాటాను డిలీట్ చేశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోవడంతో నిందితుడిని 25న అరెస్టు చేసినట్టు డీసీపీ సాయిశ్రీ వివరించారు.