మల్యాల, మే 5: పౌర్ణమి సందర్భంగా శుక్రవారం కొండగట్టు హనుమాన్ ఆలయం చుట్టూ గిరిప్రదక్షిణ చేశారు. ఆలయ చరిత్రలో తొలిసారిగా చిలుకూరి బాలాజీ శివాలయ అర్చకులు రామదాస్ సురేశ్ ఆత్మారాం ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో 200 మంది హనుమాన్ దీక్షాపరులు, భక్తులు పాల్గొన్నారు. ఉదయం కొండగట్టు దిగువన గల బస్టాండ్ సమీపంలోని ఆంజనేయస్వామి విగ్రహం నుంచి ప్రారంభమైన ప్రదక్షిణ దొంగలమర్రి, నాచుపల్లి కమాన్‌రోడ్, డబ్బుతిమ్మయ్యపల్లి ఎక్స్ రోడ్, రాంసాగర్, మద్దుట్ల, రామన్నపేట, నూకపల్లి, మల్యాల ఎక్స్‌రోడ్ నుంచి దిగువ కొండగట్టు మీదుగా ఘాట్‌రోడ్డు గుండా అంజన్న ఆలయానికి చేరుకున్నది. సుమారు 25 కిలోమీటర్ల మేర ఈ ప్రదక్షిణ సాగింది. ఈ సందర్భంగా సురేశ్ ఆత్మరాం మాట్లాడుతూ తమిళనాడులోని తిరుమన్నాళై ఆలయం చుట్టూ చేపట్టే గిరిప్రదక్షిణ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు.