Indiramma Indlu | శాయంపేట, జనవరి 3: ఇందిరమ్మ ఇండ్ల సర్వే యాప్‌లో పంచాయతీ కార్యదర్శి నమోదు తీరు అధికారులను విస్తుపరిచింది. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గోవిందాపూర్‌లో ఇందిరమ్మ ఇండ్ల కోసం 198 దరఖాస్తులు రాగా, వారి ఫొటోను యాప్‌లో నమోదు చేయాల్సి ఉన్నది. గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ ఏకంగా 100 ఇండ్లు టార్పాలిన్ కప్పిఉన్న పెంకుటిండ్లుగా నమోదు చేశారు. మరో గ్రామంలో సైతం 50కి పైగా ఇలాంటి ఇండ్లే ఉన్నట్టు తేలింది. ఒక్క గ్రామంలోనే 100 వరకు టార్పాలిన్ షీట్లు కప్పుకున్న పెంకుటిండ్లు ఉండడమేంటని అనుమానించిన రాష్ట్రస్థాయి అధికారులు.. జిల్లా హౌసింగ్ పీడీ రాజేందర్, ఎంపీడీవో ఫణిచంద్ర, హౌసింగ్ ఏఈలను రంగంలోకి దించారు.
టార్పాలిన్ షీట్లు కప్పిన ఇండ్లను పరిశీలించారు. వాటిలో మూడు మాత్రమే టార్పాలిన్ షీట్లు కప్పినవి ఉండగా, మిగతావి స్లాబులు, రేకుల ఇండ్లు ఉన్నట్టు గుర్తించారు. కార్యదర్శి ఇంటింటికీ తిరగకుండా టార్పాలిన్ కప్పిన ఫొటోనే 100 ఇండ్లకు నమోదు చేసినట్టుగా తెలుస్తున్నది. రాష్ట్రస్థాయి యాప్‌లో నమోదు కావడంతో తొలగించలేకపోతున్నారని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో నిర్లక్ష్యం వహించిన కార్యదర్శి శ్రీనివాస్‌కు కలెక్టర్ షోకాజ్ నోటీసు జారీ చేశారు. వారం రోజుల్లో సమాధానం చెప్పాలని ఆదేశించారు.